మనసుని జాగ్రత్తగా లేపుతున్నారు!

Wed Nov 14 2018 07:00:01 GMT+0530 (IST)

ఈ ఏడాది చివర్లో వస్తున్న శర్వానంద్ పడి పడి లేచే మనసు మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి సారి సాయి పల్లవితో జోడి కట్టిన శర్వాకు తనతో కుదిరిన కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఇప్పటికే టీజర్ ప్లస్ ఆడియో ట్రాక్ మంచి స్పందన దక్కించుకున్న నేపథ్యంలో ఫైనల్ అవుట్ ఫుట్ మీద దర్శకుడు హను రాఘవపూడి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాక్. నిజానికి హనులో మంచి భావోద్వేగాలు ఉన్న ప్రేమికుడు ఉన్నాడు. అది మొదటి సినిమా అందాల రాక్షసితో పాటు నానితో చేసిన కృష్ణగాడి వీర ప్రేమగాధలో చూడొచ్చు.కానీ లైతో యాక్షన్ థ్రిల్లర్ చేద్దామనుకున్న ప్రయత్నం మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. బడ్జెట్ పరిమితులను పూర్తిగా దాటేయడంతో పాటు విపరీతమైన పోటీ లైని దెబ్బ తీసింది. కారణాలు ఏవైనా అందరు చివరికి వేలెత్తి చూపేది దర్శకుడినే కాబట్టి పడి పడి లేచే మనసు విషయంలో ఎలాంటి పొరపాటుకు ఛాన్స్ ఇవ్వడం లేదట. అందుకే అవసరం మేరకు కొన్ని సీన్లు రీ షూట్ చేసేందుకు సైతం వెనుకాడటం లేదని తెలిసింది. కథలో ఉన్న డెప్త్ మేరకు సాయి పల్లవి సైతం డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ సహకరిస్తోందట. శర్వాతో పటు నిర్మాత సలహాలు పరిగణనలోకి తీసుకుని హను ఇవన్నీ చేస్తున్నట్టు తెలిసింది.

మొత్తానికి రాజీ పడే ధోరణికి దూరంగా పడి పడి లేచే మనసుని బెస్ట్ లవ్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో హను రాఘవపూడి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 21న విడుదల కానున్న పడి పడి లేచే మనసు శర్వానంద్ తో సాయి పల్లవికి ఏడాది తర్వాత వస్తున్న మూవీ. ఆ రకంగా కూడా ఇద్దరి అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.