Begin typing your search above and press return to search.

లేచే మనసు ఆగక తప్పదా?

By:  Tupaki Desk   |   25 Sep 2018 11:40 AM GMT
లేచే మనసు ఆగక తప్పదా?
X
రెగ్యులర్ పంధాలో కాకుండా కాస్త విభిన్నంగా కథలను ఎంచుకునే హీరో శర్వానంద్ సినిమా ఏదీ ఈ ఏడాది ఇప్పటిదాకా విడుదల కాలేదు. అనుకున్న రీతిలో షూటింగ్స్ సాగకపోవడంతో ఆలస్యం తప్పలేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో సాయి పల్లవి జోడిగా శర్వానంద్ చేస్తున్న పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న విడుదల అవుతుందని గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు అధికారికంగా పోస్టర్లు కూడా వచ్చాయి. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు అప్పుడు రావడం డౌటేనట. షూటింగ్ లో విఘ్నాలు ఏవి లేనప్పటికీ కొంత భాగం సంతృప్తి కరంగా రాకపోవడంతో హను రాఘవపూడి రీ షూట్ చేయాలనీ నిర్ణయించినట్టు వినికిడి.

దీనికి శర్వానంద్ కూడా మద్దతు తెలపడంతో నిర్మాతలు కూడా ఒప్పుకోక తప్పలేదని తెలిసింది. కాకపోతే ఇది అధికారికంగా ప్రకటించాడానికి మరికొంత సమయం పడుతుంది. రీ షూట్ కు మరో కారణం కూడా వినిపిస్తోంది. ఈ ఏడాది వచ్చిన ఓ రెండు చెప్పుకోదగ్గ సినిమాల్లో మెయిన్ పాయింట్ పడి పడి లేచే మనసులో ప్లాట్ లోని ట్విస్ట్ కు కాస్త దగ్గరి పోలికలు ఉండటంతో హను ఆ మేరకు పోలిక రాకుండా మార్పు చేసినట్టు చెబుతున్నారు. మరి ఇది నిజమైతే శర్వా సినిమాను సంక్రాంతి రేస్ లోనిలబెడతారా లేక అదే నెలాఖరుకు మణికర్ణికతో పోటీ కి సై అంటారా ఇంకా క్లారిటీ లేదు.

ఇది కాకుండా సుధీర్ వర్మతో మరో సినిమా చేస్తున్న శర్వానంద్ దాని షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తి చేసినట్టు సమాచారం. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కావాల్సి ఉండటంతో పడి పడి లేచే మనసు తర్వాతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వాయిదా వార్త నిజమైతే కనక ఒక్క సినిమా కూడా లేని సంవత్సరంగా శర్వానంద్ కు 2018 మిగిలిపోతుంది. అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పడి పడి లేచే మనసులో శర్వానంద్ సాయి పల్లవి మొదటిసారి జట్టు కడుతున్నారు. ఆ మధ్య వచ్చిన కణం తర్వాత సాయి పల్లవి కూడా తెరమీద సందడి చేయలేదు. దీంట్లో చూడొచ్చు అనుకుంటే ఇది కూడా ఆలస్యమయ్యేలా ఉంది.