Begin typing your search above and press return to search.

ఇడియ‌ట్ అవుతున్న శ‌ర్వానంద్

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:02 AM GMT
ఇడియ‌ట్ అవుతున్న శ‌ర్వానంద్
X
యంగ్ హీరోల జోరు మామూలుగా లేదిప్పుడు. ఒక‌దానివెంట మ‌రొక‌టి వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తున్నారు. న‌వ‌త‌రం డైరెక్ట‌ర్లు దూసుకొస్తుండ‌టంతో యంగ్ హీరోల‌కి మంచి మంచి క‌థ‌లు ల‌భిస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఇండ‌స్ట్రీలోని ప‌రిస్థితులు కూడా అనుకూలంగా ఉండ‌టంతో కొత్త సినిమాల జోరు కొన‌సాగుతోంది. ఇటీవ‌ల సినిమాల స‌క్సెస్ రేటు బాగా పెరిగింది. మంచి సినిమా తీస్తే నిర్మాత‌ల పెట్టుబ‌డి త‌ప్ప‌కుండా తిరిగొస్తుందనే భ‌రోసా క‌నిపిస్తోంది. అందుకే ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే సినిమాల నిర్మాణం జోరందుకొంది. ఒక్కో యంగ్ హీరో రెండు మూడు చిత్రాల్ని చేతిలో పెట్టుకొని హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. అలా కొంత‌కాలంగా బిజీబిజీగా గ‌డుపుతున్న ఓ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌.

ర‌న్ రాజా ర‌న్‌ - మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు చిత్రాల‌తో శ‌ర్వానంద్‌కి మంచి రిజ‌ల్ట్స్ ల‌భించాయి. న‌టుడిగానూ శ‌ర్వా అంటే ఏంటో మ‌రోసారి నిరూపించాయి ఆ సినిమాలు. అందుకే ద‌ర్శ‌క‌ నిర్మాత‌లంతా ఆయ‌నతో సినిమాలు తీసేందుకు పోటీ ప‌డుతున్నారు. తాజాగా ఎక్స్‌ప్రెస్ రాజా పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌` ఫేమ్ మేర్ల‌పాక గాంధీ ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకొన్న‌ట్టు స‌మాచారం. అయితే ఆ ఎక్స్‌ప్రెస్ రాజా శ‌ర్వానంద్ ఇప్పుడు మ‌ళ్లీ వేగం పెంచి రెండు కొత్త క‌థ‌ల‌కి ఓకే చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. అందులో ఓ క‌థ `జూలియ‌ట్‌.. ల‌వ్ ఆఫ్ ఇడియ‌ట్‌` అనే పేరుతో తెర‌కెక్క‌నున్న‌ట్టు స‌మాచారం.

`జూలియ‌ట్ ... ల‌వ్ ఆఫ్ ఇడియ‌ట్‌` సినిమాతో ప్ర‌ముఖ యాడ్‌ ఫిల్మ్ మేక‌ర్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. నివేదితా థామ‌స్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ట్టు తెలిసింది. పేరునుబ‌ట్టి ఇది వినోదాత్మ‌కంగా సాగే ఓ ప్రేమ‌క‌థ అని అర్థ‌మ‌వుతోంది. శ‌ర్వానంద్ తెర‌పై ఎలాంటి పాత్ర‌లో నైనా ఇట్టే ఒదిగిపోతాడు. ర‌న్ రాజా ర‌న్‌ తో త‌నలోని కామెడీ యాంగిల్‌ ని చూపించాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు సినిమాతో శ‌ర్వా ఎమోష‌న్స్‌ ని బ‌లంగా పండించాడు. ఇప్పుడు మ‌రోసారి న‌వ్వించేందుకు మ‌న ముందుకు రాబోతున్నాడ‌న్న‌మాట‌. ఈ చిత్రం యువీ క్రియేష‌న్స్‌లోనే తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలిసింది. దీంతో పాటు శ‌ర్వా మ‌రో కథ‌కీ ఓకే చెప్పాడ‌ట‌. ఆ వివ‌రాలు రెండు మూడు రోజుల్లోనే బ‌య‌టికొచ్చే అవ‌కాశాలున్నాయి.