‘96’ రీమేక్ లో వాళ్లిద్దరూ?

Thu Dec 13 2018 19:02:03 GMT+0530 (IST)

ఒక సినిమా ఓ భాషలో రిలీజ్ కాకముందే దాని రీమేక్ హక్కుల్ని కొనుగోలు చేయడం అన్నది అరుదైన విషయం. తమిళ చిత్రం ‘96’ విషయంలో అదే జరిగింది. టీజర్.. ట్రైలర్లతో నే మెస్మరైజ్ చేసి స్యూర్ షాట్ హిట్ లాగా కనిపించిన ఈ చిత్రం పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కళ్లు పడ్డాయి. ఆయన ఆలస్యం చేయకుండా రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. అనుకున్నట్లే ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో రాజు లో ఉత్సాహం వచ్చింది.సాధ్యమైనంత త్వరగా రీమేక్ మొదలుపెట్టాలని చూశాడు కానీ.. కాస్టింగ్ సంగతే ఎటూ తేలలేదు. నాని.. అల్లు అర్జున్.. గోపీచంద్.. ఇలా చాలా పేర్లు తెరమీదికి వచ్చాయి. కానీ ఎవరితోనూ సెట్ కాలేదు. ఐతే ఎట్టకేలకు ఈ చిత్రానికి లీడ్ యాక్టర్లను ఫైనలైజ్ చేశాడట దిల్ రాజు. ఈ చిత్రం లో శర్వానంద్-సమంత ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. వీళ్లిద్దరూ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని దిల్ రాజు అండ్ కో ఫిక్సయినట్లు తెలిసింది.

‘96’ సినిమా శర్వా నటించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఛాయల్లో సాగుతుంది. కాబట్టి శర్వాకు ‘96’ రీమేక్ కూడా బాగా సెట్టవుతుందని భావించినట్లున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో అద్భుతంగా నటించాడు. అతడిని శర్వా మ్యాచ్ చేయగలడని భావిస్తున్నారు. ఇక పెళ్ళయ్యాక సంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తున్న సమంత.. త్రిష పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్సయ్యారు. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య ఫిజికల్ రొమాన్స్ ఏమీ ఉండదు. ఒకరినొకరు టచ్ కూడా చేయరు. కానీ వాళ్ల మధ్య గొప్ప రొమాన్స్ పండుతుంది. అదే ‘96’ ప్రత్యేకత. తమిళ వెర్షన్ రూపొందించిన ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తాడట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.