'ఒకే ఒక్కడు' ఆ ముగ్గురిలో ఎవరు?

Tue Dec 11 2018 23:00:01 GMT+0530 (IST)

‘రోబో’కు సీక్వెల్ గా దర్శకుడు శంకర్ తాజాగా ‘2.ఓ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. 2.ఓ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో శంకర్ ప్రస్తుతం ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్ 2’ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఈ నెల 14 నుండి ‘ఇండియన్ 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే మరో సీక్వెల్ గురించి కూడా తాను ఆలోచిస్తున్నట్లుగా శంకర్ చెప్పకనే చెప్పాడు.దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమా ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన శంకర్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సీక్వెల్ లో అర్జున్ కంటే రజినీకాంత్ లేదా కమల్ హాసన్ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయంలో శంకర్ ఉన్నట్లుగా ఆయన మాటల ద్వారా అనిపిస్తోంది.

ఒకవేళ ‘ఒకే ఒక్కడు’ కథ యంగ్ హీరోను డిమాండ్ చేస్తే మాత్రం తప్పకుండా తాను విజయ్ తోనే సినిమాను చేస్తాను అంటూ శంకర్ పేర్కొన్నాడు. ఇండియన్ 2 పూర్తి అయిన తర్వాత శంకర్ చేయబోతున్నది ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వరుసగా సామాజిక అంశాలపై సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న విజయ్ ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ లో నటిస్తే ఫ్యాన్స్ సంతోషానికి పట్ట పగ్గాలు ఉండవని చెప్పుకోవచ్చు. శంకర్ - విజయ్ ల కాంబో మూవీ కోసం తమిళ తంబీలు మరియు తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020లో వారి కోరికను శంకర్ తీర్చుతాడేమో చూడాలి.