‘2.0’ కథ అలా ఉండదట

Wed Oct 11 2017 23:00:01 GMT+0530 (IST)

శంకర్-రజినీకాంత్‌ల ‘2.0’ను ‘రోబో’కు సీక్వెల్ అనే అనుకుంటున్నాం మొదట్నుంచి. రజినీకాంత్ రోబో అవతారంలో కనిపిస్తుంటే అలా అనుకోకుండా ఎలా ఉంటాం మరి? కానీ ఈ సినిమాలో రజినీకాంత్ రోబోగా కనిపించడం మినహాయిస్తే ‘రోబో’కు దీనికి అసలు పోలికే ఉండదంటున్నాడు శంకర్. ‘రోబో’ కథకు ఇది కొనసాగింపు కాదని శంకర్ చెప్పాడు. ఓ కొత్త కథతో తాను ఈ సినిమా తీసినట్లు వెల్లడించాడు. మరి ఈ సినిమాలో ‘చిట్టి’ పాత్ర కూడా ఉండదన్నమాటే.ఐతే రజినీ ఇందులో కూడా శాస్త్రవేత్తగా - రోబోగా కనిపిస్తాడన్నది మాత్రం వాస్తవం. ‘రోబో’లో విలన్ కూడా రజినీయే కాగా.. ‘2.0’లో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నాడు. మరి ఈ పాత్రలతో శంకర్ కథను ఎలా నడిపించాడన్నది ఆసక్తికరం. ఇటీవలే ‘2.0’ త్రీడీ మేకింగ్ కు సంబంధించి చిత్ర బృందం రిలీజ్ చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.

ఈ నెలాఖర్లో దుబాయ్ వేదికగా భారీ ఖర్చుతో ఆడియో వేడుక చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా ‘2.0’ టీజర్ లాంచ్ ఉంటుంది. డిసెంబర్లో చెన్నైలో ట్రైలర్ విడుదల చేస్తారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ గత ఏడాదే ముంబయిలో చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాన్నాళ్ల కిందటే షూటింగ్ ముగించిన శంకర్.. కొన్ని నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నాడు.