బాహుబలి వలన ఏడిపించేస్తున్న శంకర్

Fri Feb 23 2018 13:21:41 GMT+0530 (IST)

బాహుబలి ఎఫెక్ట్ డైరెక్టర్ శంకర్‌పై బాగా పడినట్టు ఉంది. అందుకే రోబో 2.0 ఇంత ఆలస్యమైపోతోంది. అసలే భారీ ప్రాజెక్టు కావడంతో... నెలలునెలలు విడుదల వాయిదా పడడం ఆ సినిమా నిర్మాతలకు తలనొప్పిగా మారింది. వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి శంకర్‌కు నిర్మాణ సంస్థలకు మధ్యలో బేధాభిప్రాయాలు వచ్చేలా చేసింది. మధ్యలో రజనీకాంత్ కల్పించుకుని సర్దిచెప్పారు కూడా.మొదట్లో రోబో 2.0ను విడుదల తేదీగా ఏప్రిల్ 27ను ప్రకటించారు. ఇప్పుడు ఆ డేట్ కాదు కదా... అసలు ఏ తేదీకి విడుదల అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. షూటింగ్ మొత్తం అయిపోయినా కేవలం... గ్రాఫిక్స్ కోసమే శంకర్ నెలలు నెలలు సమయం ఖర్చుపెడుతున్నాడు. మొన్నటి వరకు లాస్ ఏంజలస్‌లోనే ఉండి దగ్గరుండి మరీ గ్రాఫిక్స్ చేయించాడు. తీరా ఏ సంస్థకైతే పని అప్పజెప్పారలో ఆ సంస్థ దివాళా తీసింది. దీంతో మరో గ్రాఫిక్స్ సంస్థకు ప్రాజెక్టు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ వారి చేత దగ్గరుండి పనిచేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విడుదల మరింత లేటయ్యే అవకాశం కనిపిస్తోంది.

సినిమా ఎంతకీ పూర్తి కావడం లేదంటూ లైకా వాళ్లు శంకర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ బాహుబలి సినిమా వల్ల మన మార్కెట్ ఎంత పెద్దదో అర్థమైంది కదా... కాస్త ఓపికగా ఉండమని చెబుతున్నాడట. రజనీకి మన దేశంలోనే కాదు... మలేషియా.. జపాన్...చైనాలో కూడా మార్కెట్ ఉంది కనుక గాభరాపడవద్దని వడ్డీ కోసం ఆలోచించద్దని అంటున్నాడట. బాహుబలిని మించిన క్వాలిటీ విజువల్స్ తేవాలన్నది శంకర్ లక్ష్యమట. మొత్తమ్మీద బాహుబలి రోబో 2.0 విడుదల కాకుండా అడ్డుకున్నట్టు కనిపిస్తోంది.