అర్జున్ రెడ్డి పిల్లకు ఇంకో బంపరాఫర్

Thu Oct 12 2017 14:02:34 GMT+0530 (IST)

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోయిన్ షాలిని పాండేను చూస్తే ఈమె హీరోయిన్ ఏంటనిపిస్తుంది. ఆ సినిమాలో ఆమె పెద్దగా నటిస్తున్నట్లు కనిపించదు. కానీ సినిమా చూసి బయటికి వచ్చాక షాలినిని మరిచిపోవడం అంత సులువు కాదు. ఏదో తెలియని మ్యాజిక్ చేసిందా అమ్మాయి. సైలెంటుగానే కుర్రాళ్ లపై బలమైన ముద్ర వేసింది షాలిని. ఆ ముద్రే ఇప్పుడామెకు వరుసగా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఆల్రెడీ ‘మహానటి’ సినిమాలో షాలినికి ఓ కీలక పాత్ర దక్కింది. మరోవైపు తమిళంలో ‘100 పర్సంట్ లవ్’ రీమేక్ లోనూ షాలినినే కథానాయికగా ఎంచుకున్నా. ఇప్పుడు వీటన్నింటినీ మించిన బంపరాఫర్ ఆమె తలుపు తట్టినట్లు సమాచారం.మలయాళంలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన దుల్కర్ సల్మాన్ సరసన షాలిని నటించబోతోందట. దుల్కర్ ‘ఓకే బంగారం’ సినిమాతో తమిళం.. తెలుగు భాషల్లోనూ పేరు సంపాదించాడు. అదే తరహాలో ఇప్పుడతను తెలుగు-తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడట. ఆర్ ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. సెల్వ కుమార్ నిర్మించే ఈ చిత్రంలో దుల్కర్ కు జోడీగా షాలినిని ఎంచుకున్నారు. మరి మంచి పెర్ఫామర్ అయిన దుల్కర్ సరసన షాలిని ఎలా మెరుస్తుందో చూడాలి. దుల్కర్ కూడా ‘మహానటి’లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఆ సందర్భంగానే షాలిని టాలెంట్ చూసి తన సినిమాకు కథానాయికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.