Begin typing your search above and press return to search.

ఎంత పని చేశావ్ నాగ్..

By:  Tupaki Desk   |   16 Oct 2017 7:16 AM GMT
ఎంత పని చేశావ్ నాగ్..
X
‘రాజు గారి గది-2’ చూసిన వాళ్లందరూ ఏకాభిప్రాయంతో చెప్పిన మాట.. ఇందులో కామెడీ డోస్ సరిపడా లేదని. ‘రాజు గారి గది’కి కామెడీనే ప్రధాన ఆకర్షణ కాగా.. రెండో భాగంలో అది బ్యాక్ సీట్ తీసుకుని సెంటిమెంట్.. ఎమోషన్లే ఎక్కువ హైలైట్ అయ్యాయి. షకలక శంకర్ కు తోడు వెన్నెల కిషోర్ కూడా తోడైనప్పటికీ ఇందులో ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు. ప్రథమార్ధంలో కామెడీ కోసం పెట్టిన సీన్లన్నీ చాలా యావరేజ్ గా అనిపించాయి. ఐతే నిజానికి ఈ చిత్రంలో మంచి కామెడీ సీన్స్ లేకపోలేదట. కిషోర్-శంకర్-ప్రవీణ్ కాంబినేషన్లో ఒక పది నిమిషాల ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందట. ఆ ఎపిసోడ్లో ముఖ్యంగా షకలక శంకర్ చెలరేగిపోయినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఐతే సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలో ఈ ఎపిసోడ్ వల్ల ఇంటెన్సిటీ తగ్గిపోతోందని.. ఫ్లో కూడా పోతోందని చెప్పి నాగార్జునే దాన్ని ఎడిట్ చేయించేశాడట. ఆ విషయాన్ని ‘రాజు గారి గది-2’ సక్సెస్ మీట్లో నాగార్జునే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. ఆ ఎపిసోడ్ అనవసరం అన్న తన అభిప్రాయంతో దర్శక నిర్మాతలు కూడా అంగీకరించినట్లు నాగ్ చెప్పాడు. ఐతే నిజంగా వాళ్లందరూ మనస్ఫూర్తిగా అందుకు అంగీకరించారా అన్నది డౌటే. ఎందుకంటే నాగ్ మాటకు ఓంకార్ అడ్డు చెప్పగలడా అని డౌట్. ఇప్పుడు సినిమా చూసిన వాళ్లందరూ కామెడీ లేదు కామెడీ లేదు అంటూ పెదవి విరుస్తున్నారు. ఒకవేళ ఆ ఎపిసోడ్ ఉండుంటే జనాలకు ఈ ఫీలింగ్ వచ్చేది కాదేమో. ‘రాజు గారి గది-2’ ట్రైలర్ చివర్లో కిషోర్-శంకర్-ప్రవీణ్ ముగ్గురూ కలిసి దయ్యానికి భయపడే సీన్ హిలేరియస్ గా అనిపించింది. ఆ సీనే సినిమాలో లేకపోవడం చిత్రమే. అసలు షకలక శంకర్ సినిమాలో ఉన్న ఫీలింగే కలగకపోవడానికి ఆ ఎపిసోడ్ తీసేయడం కూడా ఓ కారణమే. ఈ సినిమాతో తనకు చాలా మంచి పేరు వస్తుందని ఆశించిన శంకర్ కు నాగ్ పెద్ద బ్రేకే వేసేశాడు.