Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ను ఫూల్స్ చేసిన షారుక్‌

By:  Tupaki Desk   |   17 July 2017 7:09 AM GMT
ఫ్యాన్స్ ను ఫూల్స్ చేసిన షారుక్‌
X
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ య‌వ్వారంపై ప‌లువురు మండిప‌డుతున్నారు. తాజాగా ఆయ‌న గూగుల్ లో త‌న గురించి ఎక్కువ‌గా వెతికిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఇందులో భాగంగా కొన్ని ప్ర‌శ్న‌ల్ని ఎంపిక చేసుకున్నారు. అయితే.. ఈ ప్ర‌శ్న‌ల్లో ఒకటైన త‌న ఫోన్ నెంబ‌రు విష‌యంలో ఆయ‌న నోటికి వ‌చ్చిన‌ట్లు చెప్పి అంద‌రిని త‌ప్పుదారి ప‌ట్టించారన్న విమ‌ర్శ ఎదుర‌వుతోంది.

ఎందుకిలా అంటే.. తాజా ఆయ‌న న‌టిస్తున్న జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్ చిత్ర ప్ర‌చారం కోసం ఈ మ‌ధ్య‌న ఏదో ఒక యాక్టివిటీని చేస్తూ వార్త‌ల్లో నిలిచేలా చేసి.. సినిమాపై హైప్ పెంచే ప్ర‌య‌త్నంలో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఎవ‌రు ఇచ్చారో కానీ.. ప్ర‌ఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో త‌న గురించి ప్ర‌జ‌లు వెతికే ప్ర‌శ్న‌లు ఏమిట‌న్న‌ది చూసి.. వాటికి స‌మాధానాలు ఇచ్చాడు.

షారుక్ కు టాటూ ఉందా? అంటే టెంప‌ర‌రీగా వేయించుకున్నాన‌ని.. త‌న‌కు టాటూలంటే భ‌య‌మ‌ని చెప్పాడు. ప్రైవేట్ జెట్ ఉందా? అంటే.. లేద‌ని.. జెట్‌ను కొని అందులో సినిమా చూడ‌ట‌మే త‌న క‌ల‌గా చెప్పారు. మీ ఫోన్ నెంబ‌ర్ ఏమిటంటే.. నోటికి వ‌చ్చిన నెంబ‌ర్ల‌ను క‌లిపేసి.. అదే త‌న నెంబ‌ర్ అని.. ఎవ‌రైనా చేయొచ్చ‌న్నారు.

ఒక‌వేళ ఎత్త‌క‌పోయినా మెసేజ్ పెడ‌తాన‌ని చెప్పిన ఆయ‌న త‌న నెంబ‌ర్ అంటూ.. 5559960321 ఇచ్చారు. అయితే.. దేశంలో ఐదు నెంబ‌రుతో మొద‌ల‌య్యే సిరీస్ లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మొత్తానికి ఫోన్ నెంబ‌ర్ అంటూ ఊరించి.. సంబంధం లేని నెంబ‌రు ఇచ్చి అభిమానుల్ని ఫూల్స్ చేశార‌న్న మాట వినిపిస్తోంది.