Begin typing your search above and press return to search.

ఈసారి పోతే.. ‘జీరో’ అయిపోతాడు

By:  Tupaki Desk   |   14 Dec 2018 6:40 AM GMT
ఈసారి పోతే.. ‘జీరో’ అయిపోతాడు
X
బాలీవుడ్లో ఒకప్పుడు షారుఖ్ ఖానే నంబర్ వన్ హీరో. అందుకే అతడిని కింగ్ ఖాన్ అని.. బాలీవుడ్ బాద్ షా అని అనేవాళ్లు. అతడి ముందు సల్మాన్ ఖాన్.. ఆమిర్ ఖాన్ తక్కువగా కనిపించేవాళ్లు. కానీ తర్వాతి కాలంలో కథ మారిపోయింది. దిగువన ఉన్న ఆమిర్ ఖాన్ పైకి వచ్చాడు. సల్మాన్ ఖాన్ తనదైన శైలి లో మాస్ హిట్లతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. షారుఖ్ మాత్రం చెత్త సినిమాలు చేసి కిందికి చేరిపోయాడు. అందులోనూ గత రెండు మూడేళ్లలో అయితే షారుఖ్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. బాలీవుడ్లో చిన్నా చితకా హీరోలు కూడా వంద కోట్ల క్లబ్బులో చేరుతుంటే.. అతను నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ దారుణాతి దారుణ ఫలితాన్నందుకుంది. షారుఖ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తినేసిందో ఈ సినిమాతోనే రుజువైంది.

దీంతో కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని ‘జీరో’ సినిమా చేశాడతను. ఇందులో షారుఖ్ మరగుజ్జు పాత్ర లో నటించాడు. ‘తను వెడ్స్ మను’.. ‘రాన్ జానా’ లాంటి మంచి సినిమాలు తీసిన ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కానీ షారుఖ్ బ్యాడ్ లక్ దీనికి కూడా అంటుకుని ఫలితం తేడా కొడుతుందేమో అన్న సందేహాలూ లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షారుఖ్ సినిమా ఆడాలంటే అదిరిపోయే టాక్ రావాలి. ఓ మోస్తరు టాక్ వచ్చిన అతడి సినిమాలేవీ నిలబడట్లేదు. మరి క్రిస్మస్ వీకెండ్లో భారీ స్థాయిలో రిలీజవుతున్న ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. ఈ సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం షారుఖ్ బాలీవుడ్ బాక్సాఫీస్ లో ‘జీరో’ అయిపోవడం ఖాయం.