Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ఫైనల్.. జోకులు పేలుతున్నాయ్

By:  Tupaki Desk   |   30 May 2016 5:30 PM GMT
ఐపీఎల్ ఫైనల్.. జోకులు పేలుతున్నాయ్
X
ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ సన్ రైజర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయ్ అనగానే సోషల్ మీడియాలో ఓ జోక్ హల్ చల్ చేసింది. ఈ రోజు రాత్రికి కింగ్ ఫిషర్ బీర్ వెర్సస్ హైదరాబాద్ బిర్యాని అంటూ కొంటె కుర్రాళ్లు తమ క్రియేటివిటీ చూపించారు. బెంగళూరు టీమ్ కింగ్ ఫిషర్ బీర్ తయారు చేసే యూబీ గ్రూపే అన్న అసంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ అనేది బిరియానీకి ఫేమస్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ నడుస్తున్నపుడు కూడా బీర్ గెలుస్తుందా.. బిరియానీ గెలుస్తుందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేల్చారు జనాలు.

ఎంత బీర్ తాగినా సరే.. బిరియాని తినకుంటే కడుపు నిండదని.. కాబట్టి బిరియానీనే గ్రేట్ అని హైదరాబాద్ టీం మద్దతుదారులు.. బీర్ తాగితే వచ్చి ఆనందం.. బిరియానీ ఇవ్వదంటూ బెంగళూరు టీమ్ సపోర్టర్స్.. సోషల్ మీడియాలో సరదాగా వాదనలకు దిగారు. ఫైనల్ అయ్యాక ‘పిల్ల జమీందార్’ సినిమాలో ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో పడుకుని ఉంటే నాని చెప్పే డైలాగ్ ను పేరడీ చేసి.. ‘‘బీర్ కావాలంటే చాలా బ్రాండ్లున్నాయి. కానీ బిరియానీ అంటే హైదరాబాద్ ఒక్కటే’’ అంటూ కామెడీ చేశారు జనాలు. మరోవైపు సన్ రైజర్స్ వ్యతిరేకంగా బెంగళూరు ఫ్యాన్స్ పేల్చిన ఓ జోక్ ను ఆ జట్టు మద్దతుదారులు రీట్వీట్ చేసుకుని సంతోషించారు. బెంగళూరు ఫస్ట్ టైం డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఫైనల్లో ఓడిందని.. ఆ జట్టు తర్వాత ఐపీఎల్ నుంచి వెళ్లిపోయిందని.. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చేతలో ఫైనల్లో ఓడగా ఆ టీం కూడా ఐపీఎల్ నుంచి ఔట్ అయిపోయిందని.. ఇప్పుడు సన్ రైజర్స్ చేతిలో ఓడింది కాబట్టి ఆ జట్టుకూ మిగతా రెండు జట్ల గతే పట్టబోతోందని బెంగళూరు ఫ్యాన్స్ జోకులు పేల్చుకుంటూ సంతోషిస్తున్నారు.