Begin typing your search above and press return to search.

సీక్వెల్ సెంటిమెంట్ తుడిచేసిన బాహుబలి

By:  Tupaki Desk   |   23 May 2017 6:04 PM GMT
సీక్వెల్ సెంటిమెంట్ తుడిచేసిన బాహుబలి
X
ఇప్పటివరకూ టాలీవుడ్ బాగా నమ్మిన సెంటిమెంట్.. సీక్వెల్స్ ఆడవు అనే. గత చరిత్ర చూసుకుంటే ఇది నిజమే అని ఒప్పుకోక తప్పదు. ఇతర భాషల మాదిరిగా.. ఒక సినిమా హిట్ అయితే.. దానికి కొనసాగింపుగా తీయడం జరిగినా.. తెలుగులో సీక్వెల్స్ ఆడిన దాఖలాలు ఏ మాత్రం లేవు.

బాహుబలి2కి ముందు వచ్చిన సీక్వెల్.. సర్దార్ గబ్బర్ సింగ్. పవర్ స్టార్ కూడా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత.. శంకర్ దాదా జిందాబాద్ చేసినా అది ఆడలేదు. ఆర్య హిట్ అయ్యాక ఆర్య-2 చేశాడు స్టైలిష్ స్టార్. కానీ ఇది నిరుత్సాహపరిచింది. చంద్రముఖి లాంటి సూపర్ సక్సెస్ మూవీని కొనసాగిస్తూ నాగవల్లి తీస్తే.. ఇది తెలుగులో మాత్రం ఆడలేదు. కిక్ తో సక్సెస్ కొట్టిన రవితేజ కిక్-2తో ఆ కిక్ ఇవ్వలేకపోయాడు. ఇవి భారీ చిత్రాల హంగామా అయితే.. మీడియం.. లో బడ్జెట్ సినిమాలు కూడా ఇలాంటి రిజల్ట్ నే ఫేస్ చేశాయి.

మనీ సక్సెస్ తర్వాత.. అదే సిరీస్ లో మరో రెండు సినిమాలు వచ్చినా ఒక్కటి కూడా ఆడలేదు. రక్త చరిత్ర ఆకట్టుకున్న స్థాయిలో రక్త చరిత్ర-2 ఆడలేకపోయింది. ఐస్ క్రీమ్ అంతో ఇంతో ఆడిందని.. ఐస్ క్రీమ్2 చేసినా సక్సెస్ మాత్రం అందలేదు. గాయం మూవీకి గాయం-2 అంటూ తీసినా రిజల్ట్ సేమ్ డిట్టో. అవును హిట్ అయిందని రవిబాబు అవును2 చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన సీక్వెల్ కనిపించదు.

బాహుబలి విషయంలో కూడా ముందు ఇదే సెంటిమెంట్ ను అందరూ పాయింట్ చేశారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ.. ఇప్పటికే 1500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను మించిపోయి మరీ దూసుకుపోతోంది బాహుబలి2. వసూళ్ల రికార్డులను సెట్ చేయడమే కాకుండా.. తెలుగు సినిమాకి సీక్వెల్స్ అచ్చిరావనే సెంటిమెంట్ ను తుడిచి పారేసింది.