Begin typing your search above and press return to search.

కమ్ములకు రావాల్సిన అవార్డు అతడికిచ్చారా?

By:  Tupaki Desk   |   21 Nov 2017 9:24 AM GMT
కమ్ములకు రావాల్సిన అవార్డు అతడికిచ్చారా?
X
ఈ తరం తెలుగు దర్శకుల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆహ్లాదకరమైన సినిమాలు తీయగల దర్శకుల జాబితా తీస్తే అందులో శేఖర్ కమ్ముల పేరు తప్పకుండా ఉంటుంది. తొలి సినిమా ‘ఆనంద్’ నుంచి లేటెస్ట్ మూవీ ‘ఫిదా’ వరకు శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత అందంగా.. ఆహ్లాదంగా ఉంటాయో తెలిసిందే. కమ్ముల ప్రత్యేకతను గుర్తించి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల కమిటీ బి.ఎన్.రెడ్డి పురస్కారాన్ని అతడికి ఇవ్వాలని భావించిందట. అతడి పేరును ఈ అవార్డుకు దాదాపుగా ఖరారు చేసేశారట కూడా. కానీ చివరి నిమిషంలో సీన్ మారిపోయినట్లుగా చెబుతున్నారు. కమ్ముల పేరు తీసి బోయపాటి శ్రీనుకే ఈ అవార్డును కట్టపెట్టేసినట్లు కమిటీ వర్గాలు అంటున్నాయి.

బోయపాటి శ్రీను తెలుగుదేశం ప్రభుత్వానికి అందించిన సహకారం గురించి ఎవరూ మరిచిపోలేదింకా. పుష్కరాల టైంలో చాలా కార్యక్రమాల్ని పర్యవేక్షించాడు బోయపాటి. ఇలా ప్రభుత్వానికి సహకారం అందించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అతడిని బి.ఎన్.రెడ్డి పురస్కారానికి ఎంపిక చేయాలన్న ఒత్తిళ్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కమిటీ సభ్యుడైన అల్లు అరవింద్ కూడా చొరవ తీసుకున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తన కొడుక్కి ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటిపై అరవింద్ కూడా అభిమానం ప్రదర్శించాడట. రాజమౌళి - త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లకు బి.ఎన్.రెడ్డి అవార్డు ఇస్తూ.. బోయపాటిని కూడా ఆ జాబితాలో చేరిస్తే గ్రాండ్ గా ఉంటుందని అరవింద్ సూచించినట్లు సమాచారం. అన్ని రకాలుగా ఆలోచించి.. కమ్ములను పక్కన పెట్టి బోయపాటికి బి.ఎన్.రెడ్డి పురస్కారానికి ఎంపిక చేసినట్లు సమాచారం. కానీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు తీసే కమ్ములకు బి.ఎన్.రెడ్డి అవార్డు దక్కితే బాగుండేదన్నది మెజారిటీ జనాల అభిప్రాయం అనడంలో సందేహమేముంది?