విలన్ మృతి వెనక సంచలన నిజాలు

Mon Feb 11 2019 15:04:32 GMT+0530 (IST)

నాలుగు పెళ్లిళ్ల విలన్ మహేష్ ఆనంద్ డెత్ మిస్టరీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. చివరి రోజుల్లో భార్య ఆసరా లేకుండా ఒంటరిగా జీవించి అటుపై అనుమానా స్పద స్థితిలో మరణించడం సంచలనమైన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి కారణమేంటి? అని ఆరాతీస్తే పలు ఆసక్తికర సంగతులు తెలిశాయి.ముఖ్యంగా అతడి మరణానికి కారణం  దురలవాట్లు కనీసం తిండికి లేకపోవడం కారణాలు అని తెలిసింది. చివరి రోజుల్లో సినిమా అవకాశాల్లేక కనీస ఆర్జన లేని సన్నివేశం నెలకొందిట. పైగా తనని చివరిగా పెళ్లాడిన రష్యన్ అతడిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే ఒంటరితనంతో ఆల్కహాల్ కు బానిసై అదే జీవితంగా బతికాడు. చివరికి దురలవాట్లు అతడి ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి. అచేతనుడై చివరకు షూటింగుకి వెళ్లేందుకు కూడా డబ్బుల్లేని సన్నివేశం కలిగింది. ఇలా ఏకంగా 18 సంవత్సరాలుగా ఒంటరితనం అతడిని వేధించింది.

మహేష్ ఆనంద్ నటించిన చిట్టచివరి సినిమా రంగీలా రాజా. గోవిందా- ప్రహ్లాద్ నిహలానీ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా షూటింగ్ కి వెళ్లేప్పుడే ఆటోకి వెళ్లేందుకు డబ్బుల్లేవని అతడు మీడియా ముఖంగా అనడం సంచలనమైంది. పిలిచి అవకాశమిచ్చిన దేవుళ్లు అంటూ నిహలానీని మహేష్ భట్ పొగిడేశారు. 6 నిమిషాల నిడివి ఉన్న పాత్రకే అతడు ఎంతో సంతోషించాడట. మరోవైపు ఆయన నలుగురిని పెళ్లాడిన వైనం స్త్రీలోలత్వంపైనా బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మహేష్ ఆనంద్ ముంబై వెర్సోవాలోని ఓ భవంతిలో ఒంటరిగా నివసిస్తూ సోఫాలో కూచుని అలానే తనువు చాలించాడు. అతడి శరీరం పూర్తిగా కుళ్లిన స్థితిలో పోలీసుల కంట పడింది. దీంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం అతడి చావుకు కారణంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇందులో ఏదైనా ఆర్థిక కోణం ఉందా?  వివాదాలేవైనా ఉన్నాయా? అని ఆరాలు తీస్తున్నారు. అయితే అతడి చిట్టచివరి భార్య రష్యాలో ఉన్నారట. అక్కడి నుంచే అతడి ఒంటరితనానికి సంబంధించిన సమాచారం తెలిసిందని చెబుతున్నారు. అయితే ఈ మృతి వెనక కారణాలపై పోలీసులే బులెటిన్ వెలువరించాల్సి ఉంది. మహేష్ ఆనంద్ చివరి రోజుల్లో విషాదకర సన్నివేశంపై ఆయన అభిమానుల్లో ఆవేదన నెలకొంది. నంబర్ 1 జగదేకవీరుడు అనే తెలుగు చిత్రాల్లో మహేష్ ఆనంద్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.