ఎక్స్ క్లూసివ్ ఫస్ట్ లుక్:సవ్యసాచి అదిరిపోయింది

Wed Aug 16 2017 09:55:29 GMT+0530 (IST)

మొదటి సినిమా పేరు 'కార్తికేయ'. రెండో సినిమా పేరు 'ప్రేమమ్'. మరి ఇప్పుడు మూడో సినిమా టైటిల్ ఏంటి? ఆ పేరును పురాణాల్లో వెతుక్కోవాలా? ఇంకెక్కడైనా చూడాలా? ఇలా దర్శకుడు చందూ మొండేటి కొత్త సినిమా గురించి అనేక ఆలోచనలు సినిమాల లవ్వర్స్ కు వచ్చేస్తున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో తన ప్రేమమ్ హీరో నాగచైతన్య తో తదుపరి సినిమాను చేస్తున్నట్లు.. అలాగే ఆ సినిమాకు చాలా మంచి టైటిల్ పెడుతున్నట్లు ఈ దర్శకుడు ప్రకటించాడు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా??

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి డైరక్షన్లో రూపొందుతున్న తదుపరి సినిమా పేరును ''సవ్యసాచి'' అని చెప్పేశారు. ఈ సినిమా లోగో లుక్ ను ఈరోజు విడదుల చేసిన మేకర్లు.. నాగ చైతన్య తన రెండు చేతుల్లోనూ చెరో బాణాన్ని పట్టుకున్నట్లు ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ టైటిల్ వెనుక.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వెనుక చాలా కథే ఉందండోయ్. ఆ విషయం డైరక్టర్ చెప్పకపోయినా కూడా మనం అర్ధంచేసుకోవచ్చు.

సపోజ్ మీరు కుడి చేత్తో రాస్తారు అనుకుందాం. మరి ఎడం చేత్తో కూడా అదే తరహాలో రాస్తారా? చాలామంది రాయలేరు. అలాగే ఎడం చేతి వాటం బ్యాట్స్ మ్యాన్ అనుకుందాం.. వారు కుడిచేతి వాటంగా అలాగే బ్యాటింగ్ చేయగలరా? ఏదో అప్పుడప్పుడూ అలాంటి ఓ షాట్ కొట్టడం తప్పించి ఖచ్చితంగా ఎడం చేత్తో ఆడినట్లు కుడిచేత్తో ఆడలేరు. ఒకవేళ రెండు చేతులుతోనూ అద్భుతంగా రాస్తే? ఎడం అండ్ కుడివైపు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే? అలా రెండు చేతులతోనూ ఒకే పనిని సమానంగా అద్భుతంగా చేసేవారిని ''సవ్యసాచి'' అంటారు. ఇంగ్లీషు పరిబాషలో చెప్పాలంటే ambidextrous అంటారు. ఇక పురాణాల విషయానికొస్తే.. రెండు చేతులతో బాణాలు సమర్ధవంతంగా వేసే అర్జునుడిని.. సవ్వసాచి అని పిలుస్తారు. మొత్తానికి ఈ సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ ను తెలుపడానికి పురాణాల్లో నుండి తవ్వి తీసిన పేరును పెట్టాడంటే.. డైరక్టర్ చందూ మొండేటి నిజంగానే ఇక్కడే తన మొదటి సక్సెస్ కొట్టేసినట్లు.

ఇప్పుడు విషయం ఏంటంటే.. అసలు ఇలా సవ్యసాచి అని పేరు పెట్టాడంటే మనోడు ఎలాంటి కథతో ఈ సినిమాను తీస్తున్నాడా అనే ఆసక్తి పెరిగిపోతోంది. ఎందుకంటే జంతువలను కూడా హిప్నటైజ్ చేయొచ్చు అంటూ చందూ తీసిన కార్తికేయ ధియేటర్లలో పిచ్చెత్తించింది. అందుకే ఇప్పుడు సవ్యసాచి అనే టైటిల్ పెట్టాడంటే ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా ఏదో డిఫరెంట్ పాయింట్ డీల్ చేస్తున్నాడనే అనిపిస్తోంది. అలాగే లోగో డిజైన్ లో ఒక చేతి ముద్ర కూడా ఉంది. అది చూస్తుంటే మాత్రం ఇదేదో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్  అనిపించకమానదు. ఇకపోతే మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోంది అని తెలుస్తోంది. అది సంగతి.