'సవ్యసాచి' సందడి షురూ కాబోతుంది

Mon Oct 22 2018 19:24:46 GMT+0530 (IST)

నాగచైతన్య నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీస్ బ్యానర్ వారు నిర్మించిన ‘సవ్యసాచి’ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడో ఆరు నెలల క్రితం విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు రంగం సిద్దం అయ్యింది. ఈ చిత్రాన్ని నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ తో సందడి చేసేందుకు సిద్దం అయ్యారు.‘సవ్యసాచి’ టీజర్ ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను దక్కించుకుంది. చాలా విభిన్నంగా చైతూ పాత్ర ఉండటంతో పాటు తన ప్రమేయం లేకుండానే చేయి పని చేయడం వంటి కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. టీజర్ విడుదల తర్వాత అందరిలో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తిని మరింతగా పెంచేందుకు థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు సిద్దం అవుతుంది. ఈనెల 24న మద్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

ట్రైలర్ విడుదలకు సంబంధించిన పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాగచైతన్య మరియు యాధవన్ కలిసి ఉన్న ఈ పోస్టర్ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రంలో మాధవన్ విలన్ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. నాగచైతన్య గత చిత్రం ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయింది. దాంతో ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు అంచనాలు పెట్టుకుని ఉన్నారు. మైత్రి మూవీస్ వారి సినిమాలకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అందుకే ఈ చిత్రం మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.