Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: సావిత్రి

By:  Tupaki Desk   |   1 April 2016 10:44 AM GMT
మూవీ రివ్యూ: సావిత్రి
X
చిత్రం : ‘సావిత్రి’

నటీనటులు: నారా రోహిత్-నందిత-మురళీ శర్మ-వెన్నెల కిషోర్-అజయ్-రవిబాబు-శ్రీముఖి-పోసాని కృష్ణమురళి-ప్రభాస్ శీను- షకలక శంకర్-సత్యం రాజేష్-ధన్య బాలకృష్ణన్-మధునందన్ తదితరులు
సంగీతం: శ్రావణ్
ఛాయాగ్రహణం: వసంత్
మాటలు: కృష్ణచైతన్య
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పవన్ సాధినేని

కెరీర్ ఆరంభం నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు రోహిత్. శరవేగంగా సినిమాలు చేస్తూనే.. ప్రతి సినిమాలోనూ వైవిధ్యం.. క్వాలిటీ.. చూపించడం అతడికే చెల్లింది. మూడు వారాల కిందటే ‘తుంటరి’గా పలకరించిన రోహిత్ ఇప్పుడు.. ‘సావిత్రి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదట్నుంచి చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. మరి విడుదలకు ముందు ఉన్న అంచనాల్ని ఈ చిత్రం అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

సావిత్రి (నందిత) చిన్నప్పట్నుంచే పెళ్లి అంటే పిచ్చి ఉన్న అమ్మాయి. తన అక్క పెళ్లి ఇష్టం లేక ఇల్లు వదిలి వెళ్లి పోతుంటే తన వల్ల పడే మచ్చతో తన పెళ్లికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఆమెను పట్టించేసే స్థాయి ఉంటుంది ఆమె పెళ్లి పిచ్చి. ఇలాంటి అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు రిషి (నారా రోహిత్). ఐతే రిషి ఎంతగా వెంటపడ్డా సావిత్రి మాత్రం కరగదు. అప్పటికే తనకు ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటానని తెగేసి చెబుతుంది. ఐతే సావిత్రికి ఇంట్లో చూసిన అబ్బాయి రిషినే. కానీ ఈ సంగతి తెలియక సావిత్రి తండ్రిని వేరే సంబంధం చూసుకోమంటాడు రిషి. అసలు విషయం తెలిశాక సావిత్రి ఇంటికి వెళ్తే ఆమె తండ్రి అతణ్ని బయటికి గెంటేస్తాడు. సావిత్రి ఇంకో పెళ్లికి రెడీ అయిపోతుంది. ఈ స్థితిలో రిషి ఏం చేశాడు.. తను ప్రేమించిని అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

కొన్నిసార్లు కథ కొత్తగా ఉన్నా సరైన ఫలితం రాకపోవచ్చు. కొన్నిసార్లు పాత కథనే రీసైకిల్ చేసి.. కథనం సరికొత్తగా ఉండేలా చూసుకుంటే మంచి ఫలితాన్నందుకోవచ్చు. యువ దర్శకుడు పవన్ సాధినేని తన రెండు సినిమాలతో ఇలాంటి అనుభవాన్నే అందుకున్నాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్.. ఆ చిత్రంతో సక్సెస్ అందుకోలేకపోయాడు. దర్శకుడిగా తన రెండో ప్రయత్నంలో తీసిన ‘సావిత్రి’ కథ కొత్తదేమీ కాదు. ‘పరుగు’ తరహా సినిమాలు చాలావాటినే గుర్తు చేస్తుంది ఈ కథ. కానీ ఈ పాత కథనే ఆహ్లాదకరమైన కథనంతో రెండు గంటల పాటు ఎక్కడా బోర్ కొట్టించకుండా చెప్పడంలో.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో పవన్ విజయవంతమయ్యాడు.

షార్ట్ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ తో వచ్చిన చాలామంది దర్శకుల్లో కనిపించే ప్రత్యేకత.. సింపుల్ హ్యూమర్ తో ఏ హడావుడి లేకుండా చాలా మామూలుగా అనిపించే సన్నివేశాలతోనే ఆహ్లాదంగా కథనాన్ని నడిపించడం.. పవన్ సాధినేని కూడా ఆ మ్యాజిక్ తోనే ‘సావిత్రి’ని ప్రేక్షకులకు చేరువ చేశాడు. ‘సావిత్రి’లో ఏ సన్నివేశమూ అంత గొప్పగా.. అంత ప్రత్యేకతంగా అనిపించదు. కానీ ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసేలా ఉంటుంది. లైవ్లీగా ఉండే పాత్రలు తయారు చేసుకుని.. వాటికి తగ్గ నటీనటుల్ని ఎంచుకుని.. మంచి సన్నివేశాలు, వాటికి తగ్గ మాటలు కూర్చుకుని.. కథనాన్ని పరుగులు పెట్టించాడు పవన్.

ఈ కథ పాతదే అయినా.. హీరోయిన్ కోణంలో కథ రాసుకోవడం ‘సావిత్రి’ ప్రత్యేకత. పెళ్లంటే పడి చచ్చే అమ్మాయి చుట్టూ కథ నడపడం అన్నదే ‘సావిత్రి’లో యునీక్ గా అనిపించే పాయింట్. తెలుగులో ఇలాంటి పాయింట్ తో సినిమా రావడం అరుదు. హీరోయిన్ పాత్ర కూడా టిపికల్ గా ఉండటంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఇక హీరో పాత్ర కూడా మాంచి ఎంటర్ టైనింగ్ గా సాగడంతో వినోదానికి ఢోకా లేకపోయింది. రైలు ప్రయాణం.. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే ప్రథమార్ధాన్ని సరదాగా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. హీరో పాత్ర మంచి వినోదాత్మకంగా సాగడం.. ప్రభాస్ శీను-షకలక శంకర్-పోసాని కృష్ణమురళి-సత్య తమవంతుగా సహాయ పాత్ర పోషించడంతో కామెడీ బాగా వర్కవుటైంది. శరవేగంగా ప్రథమార్ధం ముగిసిపోతుంది.

ద్వితీయార్ధం కూడా కొంత వరకు వినోదాత్మకంగానే సాగుతుంది. ఫిష్ వెంకట్ అండ్ బ్యాచ్ తో హీరో ఆటాడుకునే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. ఇక చివరి అరగంటను ఎమోషనల్ గా నడిపించాడు దర్శకుడు. హీరోయిన్ కుటుంబంలో రియలైజేషన్ వచ్చే చివరి 20 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు హైలైట్. మరీ ఎక్కువ డ్రామాకు అవకాశం ఇవ్వకుండా చకచకా సినిమాను ముగించేశాడు పవన్. నటీనటుల చక్కటి పెర్ఫామెన్స్ కు తోడు.. మంచి డైలాగులు కూడా తోడవడంతో పతాక సన్నివేశాల్లో ఎమోషన్ బాగా పండింది. ఈ సన్నివేశాలు కొంత వరకు ‘పరుగు’ సినిమాను తలపించినప్పటికీ.. హీరోయిన్ పాత్ర కొంచెం గందరగోళంగా అనిపించినప్పటికీ.. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి.

కథలో కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించవచ్చు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ సరిగా పండలేకపోవడం సినిమాకు మైనస్. ప్రథమార్ధంలో పూర్తిగా వినోదం మీదే దృష్టిపెట్టిన దర్శకుడు.. లవ్ స్టోరీని బిల్డ్ చేసే ప్రయత్నం చేయలేదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి సరైన కారణాలు కనిపించవు. రోహిత్-నందిత మధ్య కెమిస్ట్రీ అంత బాగా పండలేదు కూడా. హీరోను అంత మెచ్యూర్డ్ గా చూపించి.. హీరోయిన్ని మరీ తింగరిదానిలా ప్రొజెక్ట్ చేయడంతో వచ్చింది సమస్య. ఈ మైనస్ లను మినహాయిస్తే ‘సావిత్రి’ మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

నటీనటులు:

నారా రోహిత్ అంటే నచ్చని వాళ్లు కూడా ఈ సినిమాతో అతడి అభిమానులుగా మారిపోతారు. అంత బాగా రిషి పాత్రను పండించాడు రోహిత్. సినిమా సినిమాకు అతడిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. బహుశా అది మంచి కంటెంట్ ఉన్న సినిమాల్నే ఎంచుకోవడం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసమే కావచ్చు. హీరోయిన్ అక్కతో ఆమె చెల్లెలి గురించి మాట్లాడే సన్నివేశంలో రోహిత్ ప్రత్యేకత ఏంటన్నది తెలుస్తుంది. పతాక సన్నివేశాల్లోనూ అతను అదరగొట్టాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో అతడి కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఎప్పట్లాగే రోహిత్ డైలాగ్ మాడ్యులేషన్ సూపర్బ్. నందిత కూడా బాగా నటించింది. ఈ పాత్రకు ఆ అమ్మాయే కరెక్ట్ అనిపించింది. ఐతే పాత్ర పరంగా తలెత్తిన గందరగోళం వల్ల కొన్ని చోట్ల నందిత కూడా ఏం చేయాలో తోచనట్లు నటించింది. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ.. బాబాయిగా అజయ్ హుందాగా నటించారు. ప్రభాస్ శీను.. షకలక శంకర్.. పోసాని.. సత్య.. ఫిష్ వెంకట్.. వీళ్లందరూ తమ పరిధిలో బాగానే నవ్వించారు. సత్యం రాజేష్.. ధన్య బాలకృష్ణన్.. వెన్నెల కిషోర్.. మధునందన్.. శ్రీముఖి.. వీళ్లంతా కూడా బాగాచేశారు. విలన్ గా రవిబాబు పెద్దగా రిజిస్టర్ కాడు.

సాంకేతికవర్గం:

‘సావిత్రి’కి సాంకేతిక నిపుణులు పెద్ద బలంగా నిలిచారు. శ్రావణ్ సంగీతం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన నేపథ్య సంగీతంతో సినిమా అంతా ఒక ఫీల్ తో సాగిపోయేలా చేశాడు శ్రావణ్. పాటలు కూడా బాగున్నాయి. సావిత్రి థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. వసంత్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు ముఖ్య ఆకర్షణ. సినిమాకు కలర్ ఫుల్ లుక్ ఇచ్చాడు వసంత్. ద్వితీయార్ధంలో.. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో కెమెరా పనితనం బాగా కనిపిస్తుంది. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. నిర్మాణ విలువలకూ ఢోకా లేదు. కృష్ణచైతన్య ప్రథమార్ధంలో లైవ్లీగా ఉండేలా డైలాగ్స్ రాశాడు. అలాగే ద్వితీయార్ధంలో ఎమోషనల్ సీన్స్ లోనూ వాటికి తగ్గ మాటలతో ఆకట్టుకున్నాడు. ‘‘వద్దనుకుంటే ఒక నిమిషం. కానీ కావాలనుకుంటే ఒక జీవితం’’.. ‘‘మీ ప్రేమ ఖర్చులో కనిపిస్తోంది. నా ప్రేమ వాళ్లను కొట్టడంలో కనిపిస్తోంది’’.. లాంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. ఇక పవన్ సాధినేని దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్టయ్యేలా సినిమాను తీర్చిదిద్ది.. ఈ ట్రెండుకు సరిపోయే దర్శకుడనిపించుకున్నాడు పవన్. అతడి దర్శకత్వ శైలి ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను మలచడంలో పవన్ ప్రతిభను ‘సావిత్రి’ బాగానే ఎలివేట్ చేసింది.

చివరగా: సావిత్రి.. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

రేటింగ్- 3/5




Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre