Begin typing your search above and press return to search.

ఏంటి శీను ఇదంతా!

By:  Tupaki Desk   |   17 Nov 2018 6:30 AM GMT
ఏంటి శీను ఇదంతా!
X
సినిమా పరిశ్రమలో హీరోకైనా దర్శకుడికైనా ఉనికి చాటుకోవాలి అంటే సక్సెస్ తప్ప మరో మార్గం లేదు. అది ఉన్నంతవరకు ఇండస్ట్రీ లోనే కాదు ప్రేక్షకుల్లో సమున్నతమైన గౌరవం ఉంటుంది. ఒకరి దర్శకత్వ పర్యవేక్షణలో మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తో తన కెరీర్ ను ప్రారంభించిన రాజమౌళి ఇప్పుడు వెయ్యి కోట్ల మార్కెట్ ను సాధించగలిగే బాహుబలి లాంటి గ్రాండియర్ తీసే స్థాయికి చేరుకున్నాడు అంటే దానికి కారణం చిన్నది కాదు. వచ్చిన స్టార్ డం ను నిలబెట్టుకోవడంతో ప్రతి సినిమాకు కొత్తగా అందరిని మెప్పించేలా ఏం తీయాలనే నిరంతర తపన.

కానీ ఇది అందరికి సాధ్యమయ్యేది కాదని ఋజువు చేసేందుకే దర్శకుడు శీను వైట్ల ఉదాహరణగా నిలుస్తున్నాడు. తెలుగు సినిమాల్లో ఒక కొత్త తరహా హాస్య ఒరవడికి శ్రీకారం చుట్టి దాన్నే అందరు ఫాలో అయ్యేలా చేసి ఆ ఫార్ములాతో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేలా చేసిన ఘనత శీనుదే. హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న మంచు విష్ణుకి ఢీ రూపంలో ఇచ్చిన కిక్ అతనికి ఎంత పెద్ద హెల్ప్ అయ్యిందో చూసాం. రెడీతో రామ్ తో చేసిన అల్లరి శతదినోత్సవ నవ్వులు పూయించింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో దూకుడులో సైతం నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ తో శీను వైట్ల చేసిన కామెడీకి ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ వస్తూనే ఉంటుంది. దాని కన్నా ముందే శీనులో స్పార్క్ గమనించిన చిరంజీవి అతనితో డ్యూయల్ రోల్ లో అందరివాడు చేసేదాకా వదల్లేదు. ఇక దుబాయ్ శీను - వెంకీలో కామెడీ బిట్స్ లేకుండా తెలుగు హాస్య ఛానల్స్ షోలు రన్ చేయలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇదంతా గతం.

వర్తమానానికి వస్తే శీను వైట్ల తిరోగమన దిశలో వెళ్తుండటం అభిమానులను కలవర పెడుతోంది. మహేష్ బాబు కోరిమరీ కథ వినకుండా ఆగడు అవకాశం ఇస్తే అర్థం లేని అరిగిపోయిన స్వాపింగ్ ఫార్ములాతో విసిగించినప్పుడే తననుంచి ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని శీను గుర్తించాల్సింది. నాన్నకు ప్లాప్ ఇచ్చినా అదేమి పట్టించుకోకుండా రామ్ చరణ్ బ్రూస్ లీతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఉపయోగించుకోలేదు సరికదా చిరంజీవి కం బ్యాక్ కోసం క్యామియో రూపంలో అందులో నటిస్తే ఆ సీన్ తప్ప సినిమా మొత్తం డిజాస్టర్ అయ్యింది. సరే అయితే అయ్యింది పరాజయాలు ఎవరికైనా సహజం కదా అని మరో మెగా హీరో వరుణ్ తేజ్ మిస్టర్ ఛాన్స్ ఇస్తే ఇక శీను వైట్లతో సినిమా తీస్తే అంతే సంగతులు అనే స్థాయికి వచ్చేసాడు.

కానీ రవితేజ నమ్మకం కోల్పోలేదు. తనతో హ్యాట్రిక్ హిట్స్ తీసాడన్న అభిమానం పూర్తిగా కథను విశ్లేషించకుండానే అమర్ అక్బర్ ఆంటోనీని ఒప్పుకునేలా చేసింది. మొదటి షో పూర్తవ్వడం ఆలస్యం దాని జాతకం బయటపడిపోయింది. శీను వైట్ల ప్రమోషన్ ఈవెంట్స్ లో చెప్పుకున్నట్టు మాంచి కసితో ఇది తీసుకుంటాడు అని ఆశిస్తే హ్యాట్రిక్ డిజాస్టర్ కు కొనసాగింపుగా ఇది ఉందే తప్ప మెచ్చుకునే అంశం ఒక్కటీ లేదంటూ అన్ని చోట్లా ఒకటే ఫీడ్ బ్యాక్ వస్తోంది. అర్థం లేని ఒక డిజార్డర్ ని హీరో హీరోయిన్లు ఇద్దరికీ పెట్టి చివరికి ప్రేక్షకులకు సైతం అది వచ్చేంత గొప్పగా సినిమా తీశారంటూ సోషల్ మీడియాల్లో తీవ్ర స్థాయిలో కామెంట్స్ వస్తున్నాయి. గతం నుంచి నేర్చుకుంటే ఏదో ఒక కొత్త దారి దొరక్కపోదు. లేదు అంటే ఇలాంటి చరిత్ర రిపీట్ అవ్వడం తప్ప సినిమాలు హిట్ అవ్వడం జరగదు. శీను ఇది గుర్తిస్తే మంచిది