Begin typing your search above and press return to search.

కృష్ణజింక కేసులో సల్మాన్ పై సెటైర్ల వర్షం!

By:  Tupaki Desk   |   26 July 2016 5:34 AM GMT
కృష్ణజింక కేసులో సల్మాన్ పై సెటైర్ల వర్షం!
X
దాదాపు 18 ఏళ్లనుంచి కృష్ణ జింకలను వేటాడిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ను నిర్దోషిగా తేల్చుతూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రపంచంలో జరిగిన విషయాలపై తనదైన మార్కు స్పందనను తెలియచేసే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గరి నుంచి సామాన్యుడి వరకూ సోషల్ మీడియా వేదికగా ఈ కామెంట్స్ పడుతున్నాయి. వాటిని ఒకసారి గమనిస్తే...

సల్మాన్‌ నిర్దోషి అని చెప్పడానికి న్యాయస్థానానికి ఏకంగా 20 ఏళ్లు పట్టింది.. కేవలం సెలబ్రిటీ కేసుల్లోనే మన న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో తెలుస్తోంది అని వర్మ స్పందిస్తే... మిగిలిన వారు కూడా తమ తమ మార్కు కామెంట్స్ వేశారు. వాటిలో కొన్ని...

* సల్మాన్‌ ఖాన్‌ కు శిక్ష తప్పించడం కోసం కృష్ణజింక తనను తాను కాల్చేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుంది!

* సల్మాన్ ఖాన్ నిర్దోషి అయితే - జింకను ఎవరు చంపినట్లు? తన అభిమాన నటుడిని చూసిన ఆనందంలో ప్రాణం విడిచిందేమో!

* ఈ కేసులో ఇలాంటి తీర్పు రావడం ఆశ్చర్యం ఏమీ కాదులే!

* ఇక సల్మాన్ ఖాన్ కు "బీయింగ్ హ్యూమన్" ఎన్టీఓను నడపాల్సిన అవసరం ఉండదేమో.

* తన తోటి హీరోయిన్స్ లాగానే... కేసులు కూడా ఓల్డ్ అయిపోయాయి.

* 2015: సల్మాన్ ఖాన్ తాగలేదు (కారు నడిపి యాక్సిడెంట్ చేసి ఒకరి చావుకు కారణమయ్యారనే ఆరోపణల నేపథ్యం)

2016: సల్మాన్ కృష్ణ జింకను చంపలేదు.

2017: అసలు జరిగిందేమిటంటే.. సల్మాన్ కారును ఆ కృష్ణ జింకే నడిపిఉంటుంది!!

* కంగ్రాట్స్ సల్మాన్... జింక నిన్ను క్షమించింది! ఒక సూపర్ స్టార్ చేతిలో చనిపోవడాన్ని అది థ్రిల్ గా ఫీలయ్యి ఉంటుంది.

ఈ రేంజ్ లో సల్మాన్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కాగా ముందు మద్యం తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేసి ఒకరి చావుకు కారణం అయ్యారనే ఆరోపణలతో కూడిన ఒక కేసులో కూడా సల్మాన్ చాలా కాలం పాటు విచారణ ఎదుర్కొని చివరకు నిర్దోషిగా తేలిన సంగతి తెలిసిందే!!