మహేష్ బాబు మీద నెటిజన్ల సెటైర్లు

Mon Dec 10 2018 14:33:09 GMT+0530 (IST)

2014 ఎన్నికల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి ఓటేయడానికి వచ్చారు. ఐతే ఆయన లైన్లో నిలవకుండా డైరెక్టుగా లోపలికి వెళ్లాలని చూస్తే ఒక ఓటరు అడ్డుకుని.. ఇదేం న్యాయమని ప్రశ్నించి ఆశ్చర్యపరిచాడు. మిగతా ఓటర్లు అతడికే మద్దతుగా నిలవడంతో చిరు వెనక్కి తగ్గి లైన్లో నిలబడక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఈసారి జాగ్రత్త పడ్డారు. లైన్లో నిలబడే ఓటేశారు. మరోవైపు అధికార పార్టీ నాయకురాలైన కల్వకుంట్ల కవిత పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేయడానికి డైరెక్టుగా లోపలికి వెళ్లబోతుంటే జనాలు అరిచారు. ఆమెను అడ్డుకున్నారు. కవిత సైతం లైన్లో నిలబడి ఓటేయడానికి వెళ్లింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కుటుంబంతో కలిసి లైన్లోనే నిలబడ్డాడు. మిగతా సెలబ్రెటీలు.. నేతలు సైతం ఇలాగే చేశారు.ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తన భార్యతో కలిసి డైరెక్టుగా లోపలికి వెళ్లిపోయాడు. అతడిని ఎవరూ అడ్డుకోలేదు. మహేష్ కూడా లైన్లో నిలవాలన్న ఆలోచనే చేయలేదు. ఐతే ఇదే మహేష్ బాబు కొన్ని నెలల కిందటే ‘భరత్ అనే నేను’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ముఖ్యమంత్రి పాత్రలో క్రమశిక్షణ గురించి.. నిబంధనల గురించి లెక్చర్లు దంచాడు. దాని మీద ఓ చర్చా కార్యక్రమంలోనూ మాట్లాడాడు. సినిమాల వరకు నీతులు చెప్పిన మహేష్.. నిజ జీవితంలోకి వచ్చేసరికి మాత్రం పోలింగ్ కేంద్రంలో మిగతా ఓటర్లతో కలిసి లైన్లో నిలవకుండా నేరుగా లోపలికి వెళ్లిపోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ‘భరత్ అనే నేను’కు సంబంధించిన వీడియోలు పెట్టి.. పోలింగ్ కేంద్రంలోకి నేరుగా వెళ్లిపోయిన వీడియోతో దాన్ని పోల్చి మహేష్ మీద సెటైర్లు గుప్పిస్తున్నారు.