Begin typing your search above and press return to search.

అప్పుడు అర్జున్.. ఇప్పుడు మహేష్.. ఎంత తేడా?

By:  Tupaki Desk   |   26 April 2018 9:30 AM GMT
అప్పుడు అర్జున్.. ఇప్పుడు మహేష్.. ఎంత తేడా?
X
జర్నలిజం ప్రమాణాలు నానాటికీ పడిపోతున్న సంగతి అందరం చూస్తున్నాం. ఈ విషయాన్ని జర్నలిస్టులు కూడా అంగీకరిస్తారు. ఉన్నత ప్రమాణాలతో జర్నలిజంలో కొనసాగిన వాళ్లకు ఇప్పటి పరిస్థితి చూస్తే జుగుప్స కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఒకప్పుడు మీడియాకు ఉన్న గౌరవమే వేరు. సినిమాల్లో కూడా జర్నలిస్టుల్ని ఉన్నతంగా చూపించేవాళ్లు. కానీ ఈ మధ్య జర్నలిస్టులు సినిమాల్లో జోకర్ల లాగా మారిపోయారు. అందరూ వాళ్ల మీద సెటైర్లు వేసేవాళ్లే.

ఇప్పుడు కూడా విలువలతో పాత్రికేయం చేసే జర్నలిస్టులు లేకపోలేదు. మీడియా వల్ల మంచి జరగకుండా ఏమీ పోలేదు. కానీ చెత్త ఎక్కువైపోయేసరికి వాళ్లు కనబడట్లేదు. చెడు మాత్రమే ఎక్స్ పోజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ పాత్ర మీడియా తన విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించిందో చెబుతూ.. తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.

ఐతే ఒకప్పుడు సినిమాల్లో దీనికి భిన్నమైన సీన్లుండేవి. దశాబ్దంన్నర కిందట అర్జున్ హీరోగా ‘ఒకే ఒక్కడు’ అనే సినిమా వచ్చింది. అందులో అర్జున్ ఒక టీవీ రిపోర్టర్. అతను సీఎం అయిన విలన్ని లైవ్‌ లో బాగా ఇబ్బంది పెట్టేస్తాడు. అతడి తప్పులన్నీ ఎత్తి చూపి కడిగి పారేస్తాడు. ఆ చిత్రంలో ఆ సీన్ హైలైట్ గా నిలిచింది. అప్పుడు జనాల నుంచి విజిల్స్ పడ్డాయి. కానీ ఇప్పుడు సీఎం విలేకరుల్ని తిడుతుంటే క్లాప్స్ విజిల్స్ అన్నమాట. జర్నలిజం ఈ దశాబ్దంన్నరలో ఎలా మారింది.. మీడియాపై జనాభిప్రాయం ఎలా మారింది అనడానికి ఇదే రుజువు. ఈ విషయం గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో కొందరు మీమ్స్ పెట్టి వైరల్ చేస్తుండటం విశేషం.