Begin typing your search above and press return to search.

పూజ మీద బాల‌య్య క‌విత‌.. సెటైర్లే.. సెటైర్లు!

By:  Tupaki Desk   |   23 Oct 2018 1:30 AM GMT
పూజ మీద బాల‌య్య క‌విత‌.. సెటైర్లే.. సెటైర్లు!
X
టాలీవుడ్‌లో హీరోలు ఎంత‌మంది ఉన్నా బాల‌య్య రూటే స‌ప‌రేటు. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తుంటారు. సిల్వ‌ర్ స్క్రీన్ మీద ఆసువుగా డైలాగులు చెప్పేసే బాల‌య్య‌..స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేట‌ప్పుడే పాజ్ మీద పాజ్ తీసుకుంటూ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంటారు.

ఇలాంటి బాల‌య్య‌లో మ‌రో యాంగిల్ ఏమంటే.. కొన్ని డైలాగులు చెప్ప‌టం మొద‌లెడితే.. ఆప‌లేరు. నాన్ స్టాప్ గా ఆయ‌న డైలాగ్ సాగుతుంది. తెలుగు భాష మీద ఆయ‌న‌కున్న ప‌ట్టును ఎవ‌రూ త‌క్కువ చేసి చూడ‌లేరు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మ‌ధ్య‌న హిందీలో త‌న‌కున్న ప‌ట్టును ఆయ‌న అప్పుడ‌ప్పుడు ప్ర‌ద‌ర్శిస్తూ అబ్బుర‌ప‌రుస్తున్నారు. మా బాల‌య్య హిందీలో అద‌ర‌గొడుతున్నారుగా అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటూ..అందులో త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఎట‌కారం చేసుకునే వారికి కొద‌వ లేదు.

ఆ మ‌ధ్య‌న మ‌హానాడులో మోడీని ఉద్దేశించి బాల‌య్య చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌రిగిన ర‌చ్చ గుర్తుండే ఉంటుంది. ఈసారి.. రాజకీయ డైలాగుల్ని వ‌దిలేసిన బాల‌య్య క‌విత‌తో అర‌వింద స‌మేత ఫేం పూజాను పొగిడేసిన తీరు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆదివారం జ‌రిగిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్న బాల‌య్య‌.. సినిమా గురించి పొగిడేయ‌టం ఒక ఎత్తు అయితే.. హీరోయిన్ పూజా హెగ్డే అందాన్ని పొగిడేసిన తీరు ఇప్పుడు అంద‌రి నోట నానుతోంది. హిందీలో క‌విత‌ను వ‌దిలిన బాల‌య్య తీరుతో పూజా ఎంత‌గా ఇంప్రెస్ అయ్యారో.. వీడియోల‌లో ఆమె ఎక్స్ ప్రెష‌న్ చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. అయితే.. వ‌చ్చిన చిక్క‌ల్లా.. బాల‌య్య అన్న హిందీ మాట‌ల‌కు అర్థం కాక త‌ల ప‌ట్టుకున్నోళ్లు లేక‌పోలేదు.

ఆసువుగా మాట్లాడేసిన బాల‌య్య క‌విత‌ను క‌ష్ట‌ప‌డి ఏర్చికూర్చి.. పేప‌ర్ మీద ఒద్దిక‌గా రాసుకున్నా.. దీని భావ‌మేమి బాల‌య్య అని అనుకోవాల్సిన ప‌రిస్థితి. దీనికి త‌గ్గ‌ట్లే సోష‌ల్ మీడియాలో సెటైర్లు భారీగా పేలుతున్నాయి. ఇంత‌కీ బాల‌య్య నోటి నుంచి వ‌చ్చిన క‌వితకు అక్ష‌ర రూపం ఇస్తే.. ‘లగ్తాహై ఆస్మాన్‌ సే ఫరిస్తా ఉతర్‌కే సంగ్‌మే మరమరాన్‌మే బనాలేంగే.. హర్‌ ఖలీ మస్తే .. పత్తీ పత్తీ గులాబ్‌ హోజాతీ హై.. అంటూ చెప్పిన మాట‌కు అర్థ‌మేంటి? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది.

బాల‌య్య క‌విత‌కు సోష‌ల్ మీడియాలో జోకులు ఓ రేంజ్లో పేలుతున్నాయి. అయ్య ఈ భాషాకో తెల్గూమే బోలే మేధావుల్ హైతే.. నాకుజ‌మ‌ఝ్ అయ్యేలా బోలండి ప్లీజ్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం.. అమ్మాయిల‌ను ప‌డేయాలంటే బాల‌య్య ద‌గ్గ‌ర‌కు ట్యూష‌న్ కు వెళ్లాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. అర‌వింద స‌మేత స‌క్సెస్ మీటేమో కానీ.. బాల‌య్య క‌విత మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఒక హీరోయిన్ అందాన్ని అంత ఓపెన్ గా పొగిడేసిన బాల‌య్య ఇమేజ్ ఆదివారం రాత్రి నుంచి మారింద‌న్న మాట వినిపిస్తోంది.