Begin typing your search above and press return to search.

బాహుబలికే కాదు.. కట్టప్పకూ అక్కడ చోటు

By:  Tupaki Desk   |   12 March 2018 4:06 AM GMT
బాహుబలికే కాదు.. కట్టప్పకూ అక్కడ చోటు
X
‘బాహుబలి’ సినిమాలో నటించిన ప్రతి నటుడికీ తమ కెరీర్లోనే ఎన్నడూ రానంత పేరొచ్చింది. చిన్న పాత్రలు చేసిన వాళ్లు సైతం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో ‘బాహుబలి’ పాత్ర తర్వాత అత్యంత పేరు సంపాదించిన క్యారెక్టర్లలో కట్టప్ప ఒకటి. ఈ పాత్ర బాగా జనాల్లోకి వెళ్లింది. ఇందులో సత్యరాజ్ నటనకు గొప్ప ప్రశంసలు లభించాయి. కట్టప్పను ఒక పాత్రగా కాకుండా నిజమైన వ్యక్తిలాగా జనాలు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడీ పాత్రకు మేడం టుస్సాడ్ మ్యూజియంలోనూ చోటు దక్కబోతున్నట్లు సమాచారం. బ్యాంకాక్ శాఖలో ఈ పాత్ర తాలూకు మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారట.

ఇప్పటికే ‘బాహుబలి’గా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని సరసన కట్టప్ప విగ్రహం కూడా చేరబోతోంది. త్వరలోనే ఈ దిశగా పని మొదలవుతుందట. సత్యరాజ్ నుంచే కొలతలు తీసుకుని విగ్రహాన్ని తయారు చేసే అవకాశాలున్నాయి. కెరీర్ లో రెండు వందలకు పైగా సినిమాలు చేసినప్పటికీ సత్యరాజ్ తమిళంలో మాత్రమే గుర్తింపు సంపాదించారు. కానీ ‘బాహుబలి’తో ఆయన గురించి దేశం మొత్తానికి తెలిసింది. ప్రపంచ దేశాల్లోనూ గుర్తింపు సంపాదించారు. ‘బాహుబలి’తో వచ్చిన గుర్తింపుతో సత్యరాజ్ దక్షిణాదిన పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు.