యావరేజ్ టాక్ కే రికార్డు కలెక్షన్స్..!

Thu Nov 08 2018 23:03:39 GMT+0530 (IST)

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటే ఏ స్థాయిలో ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడు వేల స్క్రీన్ లలో విడుదలైన సర్కార్ చిత్రం మొదటి రోజే ఏకంగా 67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూళ్లు చేయడం జరిగింది. రెండవ రోజు కూడా దీపావళి సెలవు అవ్వడం వల్ల సందడి కనిపించింది. రెండవ రోజు ఈ చిత్రం 43 కోట్లను వసూళ్లు చేసి రెండు రోజుల్లోనే 110 కోట్లను తన ఖాతాలో సర్కార్ చిత్రం వేసుకుంది.‘సర్కార్’ చిత్రం విజయ్ ఫ్యాన్స్ కు నచ్చింది. కాని సాదారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం యావరేజ్ టాక్ తో నడుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా విజయ్ తన క్రేజ్ తో రెండు రోజుల్లోనే 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ కి పెద్దగా క్రేజ్ లేదు. ఆయన సినిమా చిత్రాలు ఏవి కూడా పెద్దగా తెలుగులో వసూళ్లు చేయలేదు. కాని ఈ చిత్రం మాత్రం తెలుగు రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లోనే దాదాపుగా 3.8 కోట్ల షేర్‌ను రాబట్టినట్లుగా సమాచారం అందుతుంది.

విజయ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రాబట్టడం గొప్ప అన్నట్లే. తెలుగు రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే తమిళనాడు - కేరళ - కర్ణాటకలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూనే ఉంది. మొదటి వారాంతం ముగిసేప్పటికి 200 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం సునాయాసంగా చేరడం ఖాయంగా అనిపిస్తుంది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ విషయంలో రికార్డుల మోత మ్రోగిస్తున్నాడు విజయ్. తన క్రేజ్ తో అన్ని ఏరియాల్లో - విడుదలైన అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ ను ఈ చిత్రం దక్కించుకుంది.