ట్రైలర్ టాక్: సర్కార్ హత్య చేస్తాడంట

Wed Mar 01 2017 23:17:21 GMT+0530 (IST)

క్లోజ్ యాంగిల్ లో కెమెరాను పెట్టి.. యాక్టర్ల చేత గంభీరమైన పంచ్ డైలాగులను కూడా స్లోగా చెప్పించడం. మధ్యలో గన్ తీసి కాల్చేయడం. ఎవరికివారు చంపేస్తా చంపేస్తా అంటూ శపథాలు చేయడం. చివరకు కొందరు చచ్చిపోవడం. ఇదే ''సర్కార్'' థీమ్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఇదే పని చేస్తున్నాడు. చేసేశాడు. పదండి చూసేద్దాం.

మరోసారి అమితాబ్ బచ్చన్ ను లీడ్ రోల్లో పెట్టేసి ''సర్కార్'' సినిమాను తీశాడు రాము. ''సర్కార్ రైజస్ ఎగైన్'' అంటూ 3వ భాగంగా వస్తున్న ఈ సినిమాలో.. ట్రైలర్ ను బట్టి చూస్తే మనకు కనిపిస్తున్న ప్రత్యేకత ఏంటంటే.. దాదాపు 25 ఏళ్ళ నుండి ఒక్కసారిగా ఏ గన్నూ చేత్తో పట్టుకోని సర్కార్ ఇప్పుడు తనే గన్ చేతిలోకి తీసుకుని.. నేను పగ తీర్చుకుంటా అంటున్నాడు. సర్కార్ 3వ భాగంలో కంటెంట్ ఎలా ఉండబోతుంది.. రియల్ లైఫ్ శివసేన అధినేత బాల్ థాక్రే చనిపోయారు కాబట్టి.. సర్కార్ 3వ భాగం ఏమైనా మారుతుందా.. ఇలాంటి సందేహాలు ఉన్నవారికి రాము ఇప్పుడు కొత్త సర్కార్ నే చూపించాడు. కొన్ని కొత్త క్యారెక్టర్లతో కొత్త కథను అల్లేశాడు.

కాకపోతే అవే గన్నులు.. అవే కాల్పులు.. పెద్దగా స్టోరీ ఏం లేకుండా కేవలం కాల్పులు చావుల మధ్యన కెమెరాను ప్యాన్ చేసి సినిమా ఫినిష్ చేసినట్లుంది యవ్వారం అనేది ట్రైలర్ చూసిన క్రిటిక్స్ మాట. అది సంగతి.