Begin typing your search above and press return to search.

సర్దార్ బయ్యర్స్ సంచలన ప్రెస్ మీట్

By:  Tupaki Desk   |   20 Feb 2017 12:51 PM GMT
సర్దార్ బయ్యర్స్ సంచలన ప్రెస్ మీట్
X
సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్స్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. సదరు సినిమా వల్ల భారీగా నష్టపోయిన తమను ఆదుకుంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చి.. తన తదుపరి కాటమరాయుడి సినిమా తీస్తున్నారని..ఆ సినిమా హక్కులు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ ఫ్యాన్స్ గా తమ అభిమాన నటుడి సినిమాను తాము భారీ ధరకు వెచ్చించి కొన్నామని.. భారీగా నష్టపోయినట్లుగా సర్దార్ సినిమా బయ్యర్ సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నేను కృష్ణా జిల్లా రైట్స్ తీసుకున్నాను. రూ.4.5కోట్లతో కొన్నాను. వచ్చిన షేర్ రూ.2.58కోట్లు మాత్రమే. దగ్గర దగ్గర రూ.1.8కోట్లు (దగ్గర దగ్గర రూ.2కోట్లు) నష్టం వచ్చింది. మాకొచ్చిన నష్టాన్ని పవన్ దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే.. నష్టపోయిన వారిని ఆదుకునేందుకు వెంటనే పవన్ బాబు సినిమా తీస్తున్నారని చెప్పారు. మేం చాలా ఆనందించాం. ఆ సినిమారైట్స్ మాకిస్తామని చెప్పారు. ఏడాదిగా ఎదురు చూస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో కలవమన్నారు. అప్పటి నుంచి ప్రయత్నిస్తుంటే.. శరద్ మురార్.. పవన్ కార్యాలయంలోని శ్రీనివాస్ ఫోన్ ఎత్తటం లేదు. మెసేజ్ లకు స్పందించటం లేదు. నాలాంటి వాడికి రూ.2కోట్ల నష్టం అంటే సామాన్యమైన విషయమే. నా పరిస్థితుల్లో వేరే వారు ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సర్దార్ సినిమా రైట్స్ ను మాకిస్తున్నట్లుగా చెప్పారని.. విడుదలకు ముందు ఆఫీసుకు పిలిపించి.. సినిమాను ఈరోస్ కు అమ్మినట్లుగా చెప్పి.. వారి దగ్గర కొనమన్నారని.. పవన్ బాబు మీదున్న నమ్మకం.. వారు చెప్పినట్లే అగ్రిమెంట్లను కనీసం చదవకుండా సంతకం చేసేశామని.. ఏడాది తర్వాత మా సంగతేమిటంటే.. ఈరోస్ వద్దకు వెళ్లి అడగాలంటూ చెబుతున్నారని.. ఇదేం న్యాయమని సంపత్ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పవన్ తర్వాత చిత్రం కాటమరాయుడి సినిమా.. సర్దార్ కారణంగా నష్టపోయిన వారి కోసం చేస్తున్నదే అయినా.. శరద్ మురార్.. శ్రీనివాస్.. తమ సన్నిహితులు.. బంధువులకు అమ్మారని ఆరోపించారు. ‘ఈస్ట్.. వెస్ట్.. వైజాగ్ లాంటి సెంటర్లు కచ్ఛితంగా లాభాలు వస్తాయి. అలాంటి చోట్ల అంతా శ్రీనివాస్ తన బంధువులకు సినిమాను అమ్మేశారు. మా సంగతేమిటంటే.. ఈ రోస్ వద్దకు వెళ్లాలని చెబుతున్నారు. మొదట్లో చెప్పిన దానికి.. ఇప్పటికి సంబంధం లేదు. అదేమంటే.. బెదిరింపులకు దిగుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

తన ఆవేదనను చెప్పుకునేందుకు పవన్ కల్యాణ్ ఆఫీసుకు వెళితే.. అక్కడ ఆయన అపాయింట్ మెంట్ దొరకటం లేదని.. పార్టీ ఆఫీసుకు వెళ్లాలని చెబుతున్నారని.. పార్టీ ఆఫీసుకు వెళితే పార్టీ సంగతులు తప్పించి మరింకేమీ మాట్లాడరంటున్నారని చెప్పిన సంపత్.. ఎక్కడికి వెళ్లాలో తెలీటం లేదన్నారు. ‘‘శరద్ మురార్.. శ్రీనివాస్ లకు ఫోన్ చేస్తే ఎత్తటం లేదు. మేసేజ్ లు చేస్తే రిప్లై ఇవ్వటం లేదు. సర్దార్ సినిమాను కొనేటప్పుడు అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్లు చెప్పి రూ.4.5 కోట్లు అంటే చాలా ఎక్కువని చెప్పాం. ఏం ఫర్లేదు.. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందని చెప్పారు. ఇది పవన్ కల్యాణ్ బ్యానర్ అని మీకేం నష్టం జరగదని చెప్పారు. తమ బ్యానర్ లో తర్వాత రాంచరణ్.. సాయిధరమ్ తేజ్ సినిమాలు వస్తున్నాయని భరోసాగా చెప్పారు. ఈ రోజు అస్సలు మాట్లాడటం లేదు? మేం ఏమైపోవాలి?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

పవన్ కు సన్నిహితులుగా ఉంటున్నవారు.. ఆయన పేరును వాడుకొని లాభాలు పొందుతున్నారని.. పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే తామీ ప్రెస్ మీట్ పెట్టినట్లుగా సంపత్ వ్యాఖ్యానించారు. మరి.. సర్దార్ వల్ల నష్టపోయిన బయ్యర్స్ ఆవేదనకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. పలు వర్గాల కష్టాల్ని ఒకటి తర్వాత ఒకటిగా తెరపైకి తెస్తున్న పవన్.. తన సినిమా కారణంగా నష్టపోయిన వారి సమస్యల్ని పరిష్కరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటిని సరిదిద్దుకున్నాతక బయట సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుందేమో..?