Begin typing your search above and press return to search.

పద్మావత్ కు దారులు తెరుచుకున్నట్టేనా?

By:  Tupaki Desk   |   23 Jan 2018 11:07 AM GMT
పద్మావత్ కు దారులు తెరుచుకున్నట్టేనా?
X
మరో 24 గంటల తర్వాత పద్మావత్ దేశవ్యాప్త ప్రదర్శనలు ప్రారంభం కాబోతున్నాయి. అధికారికంగా విడుదల ఎల్లుండి 25న అయినప్పటికీ రేపు సాయంత్రం నుంచే అన్ని ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. అంతా క్లియర్ గా ఉన్నప్పటికీ కర్ణి సేన బెదరింపులు ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో థియేటర్లో బొమ్మ పడే దాకా నమ్మలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజ్ పుత్ ప్రాబల్యం అధికంగా ఉండే నాలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. హైదరాబాద్ నగరంలో సైతం పద్మావత్ విడుదలను నిరసిస్తూ ప్రదర్శన - దిష్టి బొమ్మల దహనం లాంటివి జరుగుతున్నట్టు వార్తలు అందుతున్నాయి.పైగా నిన్న రాజస్తాన్ చిత్తోర్ ఘర్ లో రెండు వేల మహిళలు సామూహిక ఆత్మహత్య బెదరింపుకు ప్రధానికే లేఖ రాయడం వివాదాన్ని ఇంకాస్త ముదిరేలా చేసింది. అసలు సినిమా చూడకుండా ఇంత మితిమీరడం గురించి విమర్శలు రేగుతున్న నేపధ్యంలో కర్ణి సేన ఒక ప్రతిపాదన ఆమోదించింది.

కర్ణి సేన అద్యక్షుడు లోకేంద్ర సింగ్ ఈ సినిమాను ముగ్గురు సెన్సార్ సభ్యులతో పాటు తాము ఎంపిక జర్నలిస్ట్ బృందంతో కలిపి చూపిస్తే అప్పుడు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించడం కొంత ఊరట కలిగించేదే. నిజానికి తన సినిమా చూడమని ప్రపోజల్ పెట్టింది సంజయ్ లీలా భన్సాలీనే. లోకేంద్ర సింగ్ అనుకూలంగానే స్పందించినా ఇదేదో ముందే చేయాల్సింది అని చురక వేయటం గమనార్హం, ఇప్పుడో రేపు ఉదయంలోపే ఈ ప్రదర్శన జరగనుంది. అందులో తమ మనోభావాలు దెబ్బ తినేలా ఏమి లేదు అని లోకేందర్ సింగ్ ప్రకటిస్తే సాఫీగా విడుదల జరుగుతుంది.

ఇది పైకి తేలికపాటి వ్యవహారంలా కనిపిస్తోంది కాని లోకేందర్ సింగ్ బృందం అంత ఈజీగా సినిమాలో ఏమి లేదు అనేంత సీన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ చిన్న అభ్యంతరాన్ని ఉపేక్షించినా రేపు విడుదల అయ్యాక మీరు చూసి కూడా దీన్ని ఎలా సమర్దించారు అని తన వర్గం నుంచే ప్రశ్నలు ఎదురవుతాయి. అందుకే సీన్ కాదు కదా ఏదైనా చిన్న బిట్ తమకు నచ్చకపోయినా ఈ టీం ఒప్పుకోదు. ఇప్పుడు ఈ ప్రదర్శన జరగడం భన్సాలీకి హాస్పిటల్ లో డెలివరీ కోసం బయట ఎదురు చూస్తున్న భర్త పరిస్థితిలా ఉంటుంది . ఈ ఒక్క అడ్డంకి తొలగిపోతే దేశవ్యాప్త పద్మావత్ విడుదలకు మార్గం సుగమమైనట్టే.