సెక్స్ రాకెట్ పై నోరువిప్పిన శ్రేష్ట - సంజన

Mon Jun 18 2018 15:31:42 GMT+0530 (IST)

అమెరికా సెక్స్ రాకెట్ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఈ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.  హీరోయిన్లను వ్యభిచార కూపంలోకి దించిన నిర్మాత మోదుగుమిడి కిషన్ - ఆయన భార్య చంద్ర అరెస్ట్ తో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో శ్రీరెడ్డి రేపిన దుమారం మరిచిపోకముందే మరోసారి అమెరికన్ సెక్స్ రాకెట్ కలకలం రేపుతోంది. దీంతో టాలీవుడ్ ప్రతిష్ట మసకబారుతోంది. అమెరికన్ సెక్స్ రాకెట్ పై తాజాగా శ్రీరెడ్డి - యాంకర్ అనసూయ - మా అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు మహిళా సినీ ప్రముఖులు ఈ రాకెట్ పై మాట్లాడి సంచలనం సృష్టించారు.పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన సంజన అమెరికన్ సెక్స్ రాకెట్ పై తాజాగా స్పందించింది.. ‘‘అమెరికాలో సాంస్కృతిక ఈవెంట్ల పేరుతో కొందరు సినీ తారలను సంప్రదించడం సర్వ సాధారణం. అమెరికాకు సినీ తారలు వెళ్లడం కొత్తేమీ కాదు.. టాలీవుడ్ లో చిన్నా చితకా సీ లేదా డీ గ్రేడ్ ఆర్టిస్టులను కొందరు ఈవెంట్ల నిర్వాహకులు తీసుకెళుతున్నారు. అలాంటి వారిని ఇలాంటి వ్యవహారంలోకి లాగుతుంటారు’’ అని సినీ నటి సంజన వెల్లడించింది.  ఈవెంట్లలో డ్యాన్సులు - స్కిట్ వేయడం కోసం ఆహ్వానిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంటారు. కొందరు మాత్రం డబ్బు కోసం తమ అంగీకారం తో ఇలాంటి పనులకు ఒప్పుకుంటారని సంజన బాంబు పేల్చింది.

ఇక అమెరికన్ సెక్స్ రాకెట్ విషయంలో తనకూ చేదు అనుభవం ఎదురైందని అర్జున్ రెడ్డి - పెళ్లి చూపులు సినిమాలకు పాటలు రాసిన శ్రేష్ట మీడియా ఎదుట వాపోయింది. కేవలం సినీ తారలే కాకుండా మహిళా గేయ రచయితలను కూడా ఇలాంటి వ్యవహారాలకు టార్గెట్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో లైంగిక వివక్ష ఉంది. నిర్మాత కిషన్ భార్య నన్ను సంప్రదించింది. డబ్బు ఆశజూపి ఈ ముగ్గులోకి దించాలని చూసిందని అని సినీ రచయిత శ్రేష్ట వెల్లడించారు. ‘ఓసారి మహిళా దర్శకురాలు ఫోన్ చేసి ఓ నిర్మాత గోవాలో గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడు. అందులో నన్ను పాల్గొనమని కోరింది. కానీ దానికి నేను తిరస్కరించాను. ఆ తర్వాత నన్ను బెదిరించారు. ఆ బెదిరింపులతో ఇండస్ట్రీకే దూరమయ్యాను’ అని శ్రేష్ట ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలు చెప్పింది. సినీ పరిశ్రమలో మహిళలకు కేవలం మగవాళ్లతో ముప్పులేదని.. మహిళా ప్రముఖులు కూడా ఇలానే చేస్తారని.. ఈ దందాలోకి అమాయకులను లాగడం తరచూ జరుగుతోందని.. కుంభకోణాలు వెలుగుచూసినప్పుడే బయటపడతాయని శ్రేష్ట చెప్పుకొచ్చింది.