బిగ్ బాస్ 2 పై మొదటి ఎటాక్

Tue Jun 19 2018 15:00:02 GMT+0530 (IST)

న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 మొదలుపెట్టి ఇంకా పది రోజులు కూడా గడవలేదు. అప్పుడే పలు రకాల చర్చలకు దారి తీస్తోంది. ఫస్ట్ సీజన్ జరుగుతున్నప్పుడు పార్టిసిపెంట్స్ ఎవరు బయటికి వచ్చినా దాని గురించి రచ్చ జరిగింది లేదు. పైపెచ్చు ఎవరు ఇంటర్వ్యూకు పిలిచినా పాజిటివ్ గా చెబుతూ పబ్లిసిటీ పరంగా కూడా హెల్ప్ చేసారు. కొందరు ఉన్న స్థాయి నుంచి నిజంగానే సెలబ్రిటీగా ఎదిగారు. కానీ ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది.ఎలిమినేషన్ ప్రక్రియలో తక్కువ ఓట్లు రావడంతో పాటు ప్రవర్తన కారణంగా బయటికి  వచ్చేసిన సంజనా బిగ్ బాస్ తో పాటు నానిని కూడా హోల్ సేల్ గా టార్గెట్ చేస్తూ ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో ఓపెన్ గా మాట్లాడ్డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెలెబ్రిటీలుగా ఉన్న వాళ్ళందరూ కలిసి కామన్ విమెన్ గా వచ్చిన తనను తొక్కేశారని వాళ్ళ ఈగో అక్కడ బయట పడిందని చెప్పుకొచ్చింది. నిర్వాహకులు సైతం తిండి ఖర్చు మాత్రమే భరించి అవకాశం ఇవ్వడమే గొప్ప అనేలా పారితోషికం కూడా ఇవ్వలేదని కాస్త ఘాటుగానే ఆరోపించింది.

 సెలెబ్రిటీలు అని చెప్పుకుంటున్న వారిలో బాబు గోగినేని-దీప్తి సునయన-కిరీటి దామరాజు ఎవరో కూడా తనకు తెలియదని మిగిలినవాళ్లను కూడా టార్గెట్ చేసింది. నందిని రాయ్ ని  షో ప్రారంభానికి ముందే ఎంపిక చేసారని ఏదో  కారణం వల్ల ఆమె రావడం ఆలస్యం కావడంతో తనను  రీ ప్లేస్ చేసారని చెప్పిన సంజనా ఇప్పుడు నందిని వస్తానని చెప్పడంతో ఎలిమినేషన్ పేరుతో తనను తప్పించేశారని చెబుతోంది. అసలు సంజనా మీద షోలో ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి. సినిమాల్లో నటించి మోడల్ గా ఉండటంతో పాటు  మిస్ హైదరాబాదీ అయిన సంజనా కామన్ క్యాటగిరీలో ఎలా ఉంటుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. సంజన నటించిన సినిమాల స్క్రీన్ షాట్లు షేర్ చేసి మరీ ట్రాలింగ్ చేసారు. అవన్నీ సంజనా తోసి పుచ్చుతోంది. వన్ సైడ్ వెర్షన్ లాగా తాను మాత్రమే అన్యాయం అయ్యాను అంటున్న సంజనా తనకు తక్కువ ఓట్లు రావడం గురించి మాత్రం దాటవేత సమాధానం చెప్పడం విశేషం. పది రోజులకే బిగ్ బాస్ 2 ఇలా ఉంటే రానున్న 90 రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు జరుగుతాయో.