Begin typing your search above and press return to search.

ఇంకాస్త గెడ్డం కావాలట!

By:  Tupaki Desk   |   21 Aug 2018 6:24 AM GMT
ఇంకాస్త గెడ్డం కావాలట!
X
ఒకప్పుడు సినిమాల్లో హీరో వేషానికి గెడ్డం కావాలంటే పెట్టుడు వాటి మీదే ఆధారపడి వాళ్ళు. కారణం హీరోలకు ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ ఉండేవి కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా అలా పని కానిచ్చేసేవారు. కానీ అది ఎంత లేదనుకున్నా కృత్రిమంగానే ఉండేది. ఎంతైనా సహజంగా పెంచిన ఫీల్ పెట్టుడు గెడ్డం జుత్తుతో రాదు. అందుకే ఇప్పటి తరం హీరోలు దర్శకులు ఈ విషయంలో రాజీ కావడానికి ఇష్టపడటం లేదు. రంగస్థలం కోసం రామ్ చరణ్ తేజ్ ఏడాదికి పైగా అంత పెద్ద గెడ్డంతోనే దేశాలు తిరిగాడు. అదే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిక్కు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు వచ్చి పడింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో ఇతను నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే దీని బాధ్యతలు తీసుకున్నాడు. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు చేసారు కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.

దానికి కారణం షాహిద్ కపూర్ స్వయంగా చెబుతున్నాడు . సినిమాలో కొంత భాగం తప్ప ఆద్యంతం బాగా గుబురుగా పెరిగిన గెడ్డంతో కనిపించాలి కాబట్టి ప్రస్తుతం తను ఆ పనిలో ఉన్నాడట. అయితే ఆగస్ట్ లో మొదలుపెడదాం అనుకుంటే ఇప్పటిదాకా పెరిగిన గెడ్డం చూసి సందీప్ ఇంకాస్త పెంచమని కోరాడట. దీంతో సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఇదే రకంగా చాలా కాలం పాటు అర్జున్ రెడ్డి కోసం గెడ్డంతోనే ఉన్నాడు. ఇప్పుడు షాహిద్ వంతు వచ్చింది. అసలు షాహిద్ సెలెక్ట్ అయ్యింది కూడా ఉడతా పంజాబ్ లో అచ్చం ఇదే షేడ్స్ లో ఉండే డ్రగ్ ఎడిక్ట్ పాత్రను చూసే. షాహిద్ కొత్త సినిమా బత్తి గుల్ మీటర్ చాలు త్వరలో విడుదల కానుంది. దాని ప్రమోషన్ లో భాగంగానే షాహిద్ కపూర్ ఈ అర్జున్ రెడ్డి ముచ్చట్లు చెప్పుకున్నాడు. హిందీ వెర్షన్ టైటిల్ ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది.