సమంత పెళ్లి బహుమతుల్ని ఏం చేస్తోందంటే..

Sun Jan 21 2018 12:17:13 GMT+0530 (IST)

ఎవరైనా పెళ్లికి వచ్చిన బహుమతుల్ని అపురూపంగా భావిస్తారు. వాటిలో ప్రత్యేకమైన వాటిని ఎంచుకుని భద్రంగా దాచుకుంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలు స్పెషల్ అకేషన్స్ లో వచ్చిన బహుమతుల్ని ప్రత్యేకంగా చూసుకుంటారు. కానీ సమంత మాత్రం తన పెళ్లికి వచ్చిన బహుమతుల్ని అమ్మేయాలని చూస్తోంది. ఆమెకు అలాంటి అవసరం ఏం వచ్చింది అన్న సందేహం రావడం సహజం. ఐతే సమంత ఈ పని చేస్తోంది ఓ మంచి పని కోసం. హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ వచ్చినప్పటి నుంచి సమంత ‘ప్రత్యూష ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి అభాగ్యుల్ని ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ కోసం ఇప్పటికే కొన్ని కోట్లు ఖర్చు చేసిందామె.

‘ప్రత్యూష’కు విరాళాలందించడానికి ఇప్పటికే రెండుసార్లు వేలం పాట కూడా నిర్వహించింది సామ్. తనతో పాటు కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు.. దుస్తుల్ని ఆమె వేలం వేసి ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసింది. ఇదే తరహాలో తన పెళ్లికి వచ్చిన బహుమతుల్లో కొన్నింటిని సమంత వేలం వేయబోతోందట. ఇందుకు భర్త నాగచైతన్య.. మావయ్య నాగార్జునల అనుమతి కూడా తీసుకుందట. వాళ్లు సంతోషంగా ఇందుకు అంగీకరించారట. త్వరలోనే వేలం పాట జరగబోతోంది. ఇలా తన పెళ్లి బహుమతుల్ని కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించాలన్న సమంత ఆలోచనను అభినందించాల్సిందే. ఇంత గొప్ప మనసుంది కాబట్టే ఆమె కోట్లాది మందికి ఫేవరెట్ హీరోయిన్ అయింది.