సమంత గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Fri Oct 13 2017 19:35:06 GMT+0530 (IST)

‘రాజు గారి గది-2’లో చేసిన అమృత పాత్రే ఇప్పటిదాకా సమంత కెరీర్లో బెస్ట్ రోల్ అని ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో తేల్చేశాడు అక్కినేని నాగార్జున. సమంత సైతం ఈ పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకుంది. ఈ పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాల్లో తాను గ్లిజరినే వాడలేదని.. ఓన్ చేసుకుని - ఫీలై నటించానని ఆమె చెప్పింది. మరి అంత గొప్పగా చెప్పుకున్న ఈ పాత్రలో ఏమంత విశేషం ఉందా అని ఆసక్తిగా ‘రాజు గారి గది-2’ సినిమా చూశారు ప్రేక్షకులు. ఐతే మామా కోడళ్లు చెప్పిన స్థాయిలో కాకపోయినా.. సమంత కెరీర్లో ఈ అమృత పాత్ర ప్రత్యేకం అనడంలో మాత్రం సందేహం లేదు.బాత్రూంలో స్నానం చేస్తున్నపుడు ఎవరో వీడియో తీస్తే.. అది బయటికి రావడంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పాత్రలో నటించింది సమంత. దానికి సంబంధించిన సన్నివేశంలో సమంత నగ్నంగా ఉన్నట్లు చూపించి బ్లర్ చేస్తారు. అక్కడ సమంత నగ్నంగా ఏమీ కనిపించకపోయినా.. అలా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాంటి పాత్రను ఒక స్టార్ హీరోయిన్ చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమే. బహిరంగంగా చర్చించడానికి ఎవరూ ఇష్టపడని చర్చించని విషయాల్ని ‘రాజు గారి గది-2’లో చూపించారు. సమంత పాత్ర కూడా అందులో భాగమే. ఓ మోస్తరు స్థాయి ఉన్న ఏ హీరోయిన్ కూడా ఇలాంటి పాత్ర చేయడానికి అంగీకరించకపోవచ్చు. అందులోనూ పెళ్లి సెటిలయ్యాక ఓ పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తూ ఇలాంటి పాత్రను ఒప్పుకోవడమూ సాహసమే. ఈ పాత్ర సమంత చేయడానికి చైతూ - నాగ్ పచ్చజెండా ఊపడమూ గొప్ప విషయమే. మొత్తానికి సమంత చేసిన సాహసానికి మంచి ఫలితమే వచ్చేలా ఉంది. ‘రాజు గారి గది-2’ చూసిన వాళ్లందరూ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.