Begin typing your search above and press return to search.

సమంత.. మొట్టమొదటిసారి

By:  Tupaki Desk   |   10 Dec 2017 9:37 AM GMT
సమంత.. మొట్టమొదటిసారి
X
పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగదు. బాలీవుడ్ భామల సంగతైనా ఓకే కానీ.. దక్షిణాది హీరోయిన్ల కెరీర్లకు మాత్రం పెళ్లి తర్వాత బ్రేక్ పడిపోతుంటుంది. వాళ్లకు అవకాశాలూ తగ్గిపోతుంటాయి. వాళ్లే స్వయంగా సినిమాలు తగ్గించుకుంటూ కూడా ఉంటారు. మరి ఇటీవలే అక్కినేని వారి కోడలిగా మారిన సమంత ఏ రూట్ తీసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో ‘రంగస్థలం’.. ‘మహానటి’.. తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇరుంబు తురై’తో పాటు విజయ్ సేతుపతితో ఇంకో సినిమా చేస్తోంది. ఐతే ఈ సినిమాలన్నీ కూడా సమంత పెళ్లికి ముందు ఒప్పుకున్నవే. ఇవి దాదాపుగా పూర్తి కావచ్చాయి కూడా. పెళ్లి తర్వాత ఇప్పటిదాకా బయటి సినిమాలేవీ అంగీకరించలేదు సమంత.

ఐతే సొంతంగా ఆమె ఒక సినిమా చేయడానికి మాత్రం సిద్ధమైంది. అదే.. కన్నడ హిట్ మూవీ ‘యు టర్న్’ రీమేక్. ఈ సినిమాపై సమంత ఎప్పట్నుంచో కన్నేసింది. ఏడాది కిందటే ఈ సినిమా మొదలుపెట్టాలని అనుకుంది. కానీ కుదర్లేదు. ఎట్టకేలకు ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి ఆమె రంగం సిద్ధం చేసింది. ఈ చిత్రానికి నిర్మాత కూడా సమంతేనట. ఆమె ప్రొడక్షన్లో రాబోయే తొలి సినిమా ఇదే. త్వరలోనే లాంఛనంగా ఈ సినిమా మొదలవుతుందట. ఇదో లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ. ఇంతకుముందు ‘లూసియా’ అనే సెన్సేషనల్ మూవీ తీసిన పవన్ కుమారే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. తెలుగులోనూ అతనే డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. సమంత భర్త నాగచైతన్య ఈ సినిమాకు ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తాడట.