Begin typing your search above and press return to search.

చిన్నారి జీవితం లో వెలుగు నింపిన సమంత!

By:  Tupaki Desk   |   26 Aug 2016 1:27 PM GMT
చిన్నారి జీవితం లో వెలుగు నింపిన సమంత!
X
సమంత అనగానే అందమైన అమ్మాయి, వెండితెరపై వయ్యారాలు ఒలకబోసే హీరోయిన్ అని మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అందరికీ తెలిసిన హీరోయిన్ సమంత వేరు కొందరికి మాత్రమే తెలిసిన ప్రత్యూష ఫౌండేషన్ అనే స్వఛ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు వేరు. ఎంతో అందాన్ని ఇచ్చిన దేవుడు ఈమెకు అంతే అందమైన మనసును కూడా ఇచ్చాడు. సెలబ్రెటీలు - లెజెండులూ - స్టార్ లూ అంటే కేవలం కోట్లు వెనకేసుకుని - కోట్లేసుకుని తిరగడమే అనుకునేవారికి ఈమె ఆదర్శప్రాయురాలు కూడా. ఎందుకంటే... ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో ఓ స్వఛంద సంస్థ ఏర్పాటు చేసి సమంత చేస్తున్న సేవా కార్యక్రమాల అలాంటివి మరి. ప్రచారం కోసం - ఫోటోల కోసమని కాకుండా లక్షలు ఖర్చు పెట్టి ఎందరో అభాగ్యులైన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది సమంత.

ఈమధ్య ఒక ప్రమాదంలో కాలు కోల్పోయింది భవానీ అనే చిన్నారి! రీసెంట్ గా హైదరాబాద్ లోని మ్యాక్స్ కూర్ హాస్పిటల్లో ఉన్న ఆ చిన్నారి భవానిని సమంత కలిసింది. సెల్ఫీలు దిగో - నాలుగు కబుర్లు చెప్పో అక్కడ నుండి వెళ్లిపోలేదు సమంత. భవానీతో చాలా సేపు గడిపిన అనంతరం ఆమె కోసం కృత్రిమ కాలు అమర్చటానికి అన్ని ఏర్పాట్లూ చేయించేసింది. దీంతో ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా ఈ ఐదేళ్ల చిన్నారికి కృత్రిమ కాలు అమర్చారు. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో ఈ శస్త్ర చికత్సను విజయవంతంగా పూర్తి చేశారు ఫలితంగా... ఈ చిన్నారికి మళ్లీ నడిచే భాగ్యం కల్పించింది సమంత.

మ్యాక్స్ క్యూర్ హాస్పటల్ కు చెందిన డాక్టర్ మంజుల ఈ ఆపరేషన్లో పాల్గొని సకెస్ ఫుల్ గా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డాక్టర్ కూడా స్వతహాగా గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారట. అనేక ఆపరేషన్స్ ను ఉచితంగా నిర్వహించిన సందర్భాలు ఈమె కెరీర్ లో అనేకం ఉన్నాయట. అయితే సమంత ఇలా చేయటం ఇదే మొదటి సారి కాదు. గత కొన్నేళ్ళుగా కొన్ని కోట్ల రూపాయలని విరాళాల రూపంలోనూ, ఇలా దగ్గరుండి చేయించే పనులకూ వాడుకుంటూ ఎందరికో సహాయం చేస్తోంది. ఇప్పటివరకూ సమంత అందాన్ని మాత్రమే ఆరాదించిన వారంతా ఇప్పుడు ఆమె గొప్ప మనసుకు కూడా హ్యాట్సాఫ్‌ చెబుతారు.. మీరేమంటారు?