సమంతా వచ్చుడేమో కానీ ఫ్యాన్ ని చితక్కొట్టేశారు

Mon Mar 12 2018 15:13:24 GMT+0530 (IST)

తారల మీద అభిమానం ఉండటం మామూలే. కట్టలు తెగినట్లుగా ఉండే అభిమానం ఏ మాత్రం మంచిదికాదన్న విషయాన్ని మర్చిపోయి చేదు అనుభవాన్ని మిగుల్చుకునే వారెందరో. తాజాగా అనంతపురంలో అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. మితంగా ఉండాల్సిన అభిమానం అందుకు భిన్నంగా ఓవర్ చేసిన ఒక యువకుడి విషయంలో పోలీసులు ప్రదర్శించిన ఆగ్రహం ఇప్పుడు సంచలనంగా మారింది.అనంతపురం జిల్లాలో ఒక మొబైల్ షాప్ ఓపెనింగ్ కోసం ఈ రోజు ఉదయం సమంత వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను చూడాలన్న ఆత్రుతను ప్రదర్శించాడో యువకుడు. ఆమెవైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీన్ని గుర్తించిన పోలీసులు అతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులపై చేయి చేసుకోవటంతో అక్కడి భద్రతా సిబ్బంది ఆ యువకుడ్ని చితకబాదేశారు.

అనుకోని పరిణామంతో సమంత ఇబ్బంది పడినట్లు చెబుతున్నారు. కుర్రాడి ఉదంతంతో సీరియస్ అయిన పోలీసులు నిగ్రహం కోల్పోయి.. షోరూం దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో.. పలువురు గాయపడ్డారు. సమంత అనంతపురం జిల్లాకు రావుడేమో కానీ.. ఆమె అభిమానులకు మాత్రం లాఠీ దెబ్బలు బహుమానంగా తగిలాయని చెప్పక తప్పదు.