Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: బ్లాక్ బస్టర్ కళ కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   26 May 2017 5:45 AM GMT
ట్రైలర్ టాక్: బ్లాక్ బస్టర్ కళ కనిపిస్తోంది
X
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ రానే వచ్చేసింది. ‘ట్యూబ్ లైట్’ ట్రైలర్ ఇంటర్నెట్ ను ఓ తుపానులా తాకింది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ‘ట్యూబ్ లైట్’ ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చూసి.. అసలిది ఏ టైపు సినిమా అని గందరగోళానికి గురైన ప్రేక్షకులకు.. ట్రైలర్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ ‘స్వాతిముత్యం’ తరహా పాత్ర చేస్తున్న ఈ సినిమా.. సరిహద్దుల్లో యుద్ధం నేపథ్యంలో సాగబోతోంది. బార్డర్లో తన సోదరుడితో కలిసి సంతోషంగా గడుపుతుంటాడు హీరో. బుద్ధి మాంద్యుడైన అతడిని అందరూ ‘ట్యూబ్ లైట్’ అంటుంటారు.

ఐతే యుద్ధం కోసం వెళ్లిన హీరో సోదరుడు అక్కడ శత్రువులకు బందీగా చిక్కుతాడు. దీంతో హీరో విలవిలలాడిపోతాడు. తన సోదరుడి కోసం ఎవర్ని కలిసినా ఫలితం లేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హీరో యుద్ధాన్నే ఆపించే ప్రయత్నం చేస్తాడు. అంత అమాయకంగా కనిపించే హీరో.. యుద్ధాన్ని ఎలా ఆపగిగాడు.. తన సోదరుడిని ఎలా వెనక్కి రప్పించుకున్నాడు అన్నది మిగతా కథ అన్నమాట. సల్మాన్ తో ‘ఏక్ థా టైగర్’ లాంటి హిట్.. ‘భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ చేసిన కబీర్ ఖాన్ రూపొందించిన సినిమా ఇది. ట్రైలర్ చూస్తే వీళ్లిద్దరూ కలిసి మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనే అనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. ట్రైలర్లో ఒకచోట షారుఖ్ ఖాన్ రూపాన్ని మసకమసకగా చూపించారు. నిజంగానే అతను ఈ సినిమాలో ఉండి ఉంటే మాత్రం ‘ట్యూబ్ లైట్’ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. రంజాన్ కానుకగా జూన్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.