Begin typing your search above and press return to search.

ఒక్క షో కోసం 78 కోట్లా

By:  Tupaki Desk   |   20 Feb 2018 11:24 AM GMT
ఒక్క షో కోసం 78 కోట్లా
X
టీవీ రియాలిటీ షోల పేరు మీద ఎంత బిజినెస్ జరుగుతోందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. విపరీతమైన పోటీ ఉన్నా కూడా ఎవరికెవరు తీసి పోరు అన్న రీతిలో స్టార్ హీరోల సహాయంతో ఎంత ఖర్చు పెట్టి తీయడానికి అయినా ఛానళ్ళు వెనుకాడటం లేదు. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తో తెలుగులో కూడా ఈ ట్రెండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 11 తర్వాత పదేళ్ళ క్రితం చేసిన తన మొదటి రియలిటి షో దస్ కా దం సీజన్ 3 కోసం సల్మాన్ ఖాన్ పచ్చ జెండా ఊపాడని అక్కడి మీడియా కథనం. ప్రస్తుతం చేస్తున్న బిగ్ బాస్ అయిపోతోంది కాబట్టి సీజన్ 12కు ఎలాగూ టైం పడుతుంది.ఆ లోపు ఇది చేసేయాలని ప్లాన్ లో ఉందట సదరు ఛానల్ యాజమాన్యం.

ఇందుకు గాను సల్మాన్ ఖాన్ కు 78 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు అనే వార్త ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఇంత చేసి అందులో ఉండేది 26 ఎపిసోడ్లు మాత్రమేనట.అంటే ఒక్క గంట ఎపిసోడ్ కు సల్లు భాయ్ అక్షరాల 3 కోట్లు పుచ్చుకోబోతున్నాడు. సౌత్ లో ఓ మోస్తరు ఇమేజ్ ఉన్న యూత్ హీరో ఆరు నెలలు కాల్ షీట్స్ ఇస్తే తప్ప అంత మొత్తం ముట్టజెప్పరు. అలాంటిది సల్మాన్ ఖాన్ బ్రాండ్ కు అంత విలువ కడుతున్నారు అంటే మామూలు విషయం కాదుగా.

సల్మాన్ ఖాన్ దీన్ని అధికారికంగా ఒప్పుకోవడం లేదు. బిగ్ బాస్ షో విషయంలో కూడా ఇలాంటి వార్తలను ప్రస్తావించినప్పుడు కొట్టి పారేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటాడు అనుకోలేం. కాని మార్కెట్ లో ఉన్న డిమాండ్ - ఇమేజ్ దృష్ట్యా ఇది నిజమైనా ఆశ్చర్యం లేదు. టైగర్ జిందా హై సక్సెస్ తో ఊపుమీదున్న సల్మాన్ ప్రస్తుతం రేస్ 3 షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. కిక్ 2 - దబాంగ్ 3 ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయి.