రెండు దశాబ్దాల ఎదురు చూపులకు తెర

Sat Feb 23 2019 23:00:01 GMT+0530 (IST)

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనగానే ఠక్కున వినిపించే పేర్లలో సంజయ్ లీలా భన్సాలీ పేరు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఛారిత్రాత్మక నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్న సంజయ్ లీలా భన్సాలీ గత ఏడాది 'పద్మావత్' వంటి వివాదాస్పద చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ చిత్రం విడుదలై దాదాపు సంవత్సరం అయినా కూడా ఇంకా సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఎట్టకేలకు సంజయ్ లీలా భన్సాలీ తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చింది.ఎంతో మంది హీరోలతో సినిమాలు చేస్తున్న సంజయ్ లీలా భన్సాలీ ఎప్పుడెప్పుడు సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోతో చిత్రం చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 20 ఏళ్ల క్రితం 'హమ్ దిల్ దే చుకే సనమ్' చిత్రం వచ్చింది. కారణం ఏంటో తెలియదు కాని అప్పటి నుండి వీరిద్దరి కాంబోలో మూవీ రాలేదు. ఇతర స్టార్ హీరోలతో చేసిన సంజయ్ లీలా భన్సాలీ ఎందుకో సల్మాన్ తో మాత్రం చేయలేదు.

ఆ కారణం ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ అధికారికంగా ప్రకటించాడు. అయితే సంజయ్ లీలా భన్సాలీ ఎప్పుడు చేసే ఛారిత్రాత్మక నేపథ్యం మూవీ కాకుండా ఒక లవ్ స్టోరీని సల్మాన్ ఖాన్ కోసం తయారు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. లవ్ స్టోరీతో సల్మాన్ ను పదేళ్లు వెనక్కు తీసుకు వెళ్లి చూపించాలని సంజయ్ లీలా భన్సాలీ ప్రయత్నించనున్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'భారత్' చిత్రం పూర్తి అయిన వెంటనే సంజయ్ లీలా భన్సాలీ మూవీ పట్టాలెక్కించేలా సల్మాన్ ప్లాన్ చేసుకున్నాడు. రెండు దశాబ్దాల తర్వాత రాబోతున్న ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటూ అప్పుడే సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్మకంగా చెబుతున్నారు.