బెల్లంకొండ బాబు తెలివి చూపించాడే..

Sun Feb 18 2018 16:19:31 GMT+0530 (IST)

ముందు అనుకున్న ప్రకారమైతే బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ‘సాక్ష్యం’ ఫిబ్రవరి 9నే రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రాన్ని వేసవికి వాయిదా వేశారు. వేసవిలో మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయడానికి ఇప్పుడు ముహర్తం ఫిక్స్ చేశారు. ‘లక్ష్యం’.. ‘లౌక్యం’.. ‘డిక్టేటర్’ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ రూపొందిస్తున్న ‘సాక్ష్యం’ను మే 11న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. బాగా ఆలోచించి మంచి డేటే ఎంచుకుంది ఈ చిత్ర బృందం.ఏప్రిల్ 26న రసవత్తర బాక్సాఫీస్ సమరం చూడబోతున్నట్లు సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’తో పాటు అల్లు అర్జున్ మూవీ ‘నా పేరు సూర్య’ కూడా విడుదలవుతాయి. మరుసటి రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కాలా’ వస్తుంది. ఈ ముక్కోణపు పోరు సందడి రెండు వారాల పాటు సాగాక బెల్లంకొండ బాబు రంగంలోకి దిగుతాడు. ఈ రెండు వారాల గ్యాప్ ఆ సినిమాకు సరిపోతుంది. అవసరమైనన్ని థియేటర్లు దొరుకుతాయి.

ఐతే పోటీ ఎందుకని ‘నా పేరు సూర్య’ లేదా ‘భరత్ అనే నేను’ చిత్రాల నిర్మాతల్లో ఎవరైనా వెనక్కి తగ్గి తమ సినిమాను మే 4కో.. లేదంటే 11కో వాయిదా వేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అప్పుడు ‘సాక్ష్యం’ను వాయిదా వేయక తప్పకపోవచ్చు. ప్రస్తుతానికైతే మంచి డేటే ఛూజ్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది ఈ చిత్ర బృందం. శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు.