Begin typing your search above and press return to search.

ఇటు తేజు సినిమా.. అటు తేజు వ‌దిలేసిన సినిమా

By:  Tupaki Desk   |   27 Aug 2016 1:30 AM GMT
ఇటు తేజు సినిమా.. అటు తేజు వ‌దిలేసిన సినిమా
X
ఎవ‌రితోనో అనుకున్న సినిమాలు ఇంకెవ‌రితోనో మొద‌ల‌వ‌డం మామూలే. ఈ ఏడాది అలా తారుమారైన కాంబినేష‌న్లు చాలానే ఉన్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ చేయాల్సిన సినిమా ఒకటి ఇంకొక‌రికి వెళ్తే.. వేరొక‌రు చేయాల్సిన సినిమా అత‌డికి వ‌చ్చింది. ఆ రెండు సినిమాలూ ఒకే రోజు ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంటుండ‌టం విశేషం.

మెగా ఫ్యామిలీకే చెందిన వ‌రుణ్ తేజ్ హీరోగా గోపీచంద్ మ‌లినేని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాల‌నుకున్నాడు. అనివార్య కార‌ణాల వ‌ల్ల వ‌రుణ్ ఈ సినిమా చేయ‌లేక‌పోతే.. తేజు అత‌డి స్థానంలోకి వ‌చ్చాడు. తేజు ఈ మ‌ధ్య లుక్ మార్చింది ఈ సినిమా కోస‌మే. నల్లమలుపు శ్రీనివాస్.. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఇందులో జగపతిబాబు.. సాయిధరమ్ కు తండ్రిగా నటించబోతుండ‌టం విశేషం.

ఇక దిల్ రాజు బేన‌ర్లో సాయిధ‌ర‌మ్ ‘శ‌త‌మానం భ‌వ‌తి’ అనే సినిమాకు ముందు క‌మిటైన సంగ‌తి తెలిసిందే. కానీ ఎందుకో అత‌ను ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. త‌ర్వాత రాజ్ త‌రుణ్ తో అనుకుని.. చివ‌రికి శ‌ర్వానంద్ కు ఫిక్స‌య్యారు. రైట‌ర్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రారంభోత్సవానికి ముందే పోస్ట‌ర్ మీద ముద్రించేశారు. ఇందులో ప్ర‌కాష్ రాజ్.. శ‌ర్వా తాత‌గా న‌టిస్తున్నాడు.

పై రెండు సినిమాలూ శ‌నివారం ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంటున్నాయి.