సందీప్.. తేజు.. నువ్వా నేనా

Sun Feb 18 2018 23:00:01 GMT+0530 (IST)

ఒకప్పుడు ప్రామిసింగ్ గా కనిపించిన ఇద్దరు యువ కథానాయకులు ఇప్పుడు వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్నారు. వాళ్ల ఫ్లాపుల పరంపర ఎంతకీ ఆగడం లేదు. ఫ్లాపుల్లో హ్యాట్రిక్స్.. డబుల్ హ్యాట్రిక్స్ కొట్టేస్తూ బ్రేకుల్లేకుండా సాగిపోతున్నారు. ఆ ఇద్దరు యువ హీరోలు సాయిధరమ్ తేజ్.. సందీప్ కిషన్. మధ్యలో వచ్చి వెళ్లిపోయిన ‘రేయ్’ను లెక్కలోంచి తీసేస్తే ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు తేజు. దీంతో అతడికి స్టార్ ఇమేజ్ వచ్చింది. దర్శక నిర్మాతలు అతడి కోసం ఎగబడ్డారు. ఇక హీరోగా తర్వాతి స్థాయికి చేరతాడని అనుకుంటే.. వరుసగా ఐదు ఫ్లాపులిచ్చి పాతాళానికి పడిపోయాడు. ముఖ్యంగా తేజు లేటెస్ట్ మూవీ ‘ఇంటిలిజెంట్’ దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకుంది.ఇక సందీప్ కిషన్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ‘ప్రస్థానం’ సినిమాతో నటుడిగా తనేంటో రుజువు చేసుకుని.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన సందీప్.. ఆ తర్వాత ఆ స్థాయి హిట్టు ఒక్కటీ ఇవ్వలేదు. మధ్యలో ‘బీరువా’.. ‘టైగర్’ సినిమాలు యావరేజ్ అనిపించాయి. కానీ వాటికి ముందు వెనుక దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. ‘రన్’.. ‘ఒక్క అమ్మాయి తప్ప’.. ‘నగరం’.. ‘నక్షత్రం’.. ఇలా అతడి ఫ్లాపుల పరంపర నిరాటంకంగా సాగిపోయింది. తాజాగా ‘మనసుకు నచ్చింది’ సినిమాతో మరో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు సందీప్. ఇటు తేజుకు.. అటు సందీప్ కు బ్యాకప్ బాగానే ఉంది. అవకాశాల విషయంలో ఎప్పుడూ ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు కూడా వీళ్ల చేతుల్లో అవకాశాలున్నాయి. కానీ ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో వారి భవిష్యత్ ప్రాజెక్టులపై అనేకానేక సందేహాలు నెలకొన్నాయి. ఫ్లాపుల పరంపరలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్న ఈ కుర్రాళ్లకు ఇప్పుడు ప్రాపర్ గైడెన్స్ అవసరమనిపిస్తోంది. మరి వాళ్ల పెద్దోళ్లు కొంచెం ఫోకస్ పెడితే మంచిదేమో.