ఆ పేరు ఒక్క సినిమా ముచ్చటేనా తేజూ?

Tue Jun 25 2019 11:21:43 GMT+0530 (IST)

నమ్మకాలు అనేవి చిత్రంగా ఉంటాయి. ఎవరి నమ్మకం వారిదే. ఒకరు వాస్తును నమ్ముతారు.. ఒకరేమో స్మశానాన్ని కబ్జా చేసి ఎంచక్కా డ్రీమ్ హోమ్ కట్టుకుంటారు. న్యూమరాలజీ.. జ్యోతిష్యం.. రాజశ్యామల యాగాలు.. అన్నీ అంతే.  నమ్మేవారు నమ్ముతారు.. నమ్మనివారు నమ్మరు. ఇలా కాకుండా మూడో కేటగిరీ కూడా ఉంటారు.  వీరు కొన్ని రోజులు నమ్ముతారు కొన్ని రోజులు నమ్మరు.  సాయి ధరమ్ తేజ్ ను చూస్తే ఇప్పుడు మూడో కేటగిరీ అనే అనిపిస్తోంది.ఎందుకంటే తేజు పేరు 'చిత్రలహరి' ముందు వరకూ సాయి ధరమ్ తేజ్.  మరి వరస ఫ్లాపుల ప్రభావమో.. న్యూమరాలాజీ.. ఆస్ట్రాలజీ ఎఫెక్టో కానీ 'చిత్రలహరి' సమయంలో తన పేరును 'సాయి తేజ్' గా మార్చుకున్నాడు. 'చిత్రలహరి' టైటిల్ క్రెడిట్స్ మాత్రమే కాదు.. బయట మీడియాలో కూడా సాయి తేజ్ అనే పేరును వాడడం ప్రారంభించారు.  మళ్ళీ ఏమైందో ఏమోకానీ తేజు తన మునుపటి పేరునే వాడడం మొదలు పెట్టాడు.

నిన్న తేజు కొత్త సినిమా లాంచ్ అయింది.  మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ 'ప్రతిరోజు పండగే'.   ఈ సినిమాకు తేజు పేరు సాయి ధరమ్ తేజ్ గానే ఉంటుందట.  అంతే కాదు.  తేజు ట్విట్టర్ ఖాతాలో కూడా 'సాయి ధరమ్ తేజ్' అనే ఉంది. ఈ లెక్కన 'సాయి తేజ్' అనేది ఒక్క సినిమా ముచ్చటే. మరి ఏం జరిగిందో ఏంటో.. తేజు అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోవడంతోనే 'ధరమ్' తిరిగి వచ్చిందా? ఏమో.. ఈ విషయం మెగా మేనల్లుడే చెప్పాలి.