సుప్రీమ్ హీరో తిట్లు తిన్న వేళ

Thu Feb 22 2018 23:00:04 GMT+0530 (IST)

ఒక స్టార్ హీరో కుటుంబం నుంచి వస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కు పూర్తిగా అనుభవంలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. మూడు వరస హిట్ల తర్వాత ఐదు పరాజయాలు క్యు కట్టి పలకరించడంతో డీలా పడిన తేజు ఇటీవలే ఒక ప్రముఖ ప్రింట్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంగతులు షేర్ చేసుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం షూటింగ్ టైంలో ఒక ఫ్యాన్ ఫోన్ చేసి మాకు చిరంజీవి ఉన్నారని నువ్వు సినిమాలు చేయటం ఆపేయమని సీరియస్ గా చెప్పాడట. అప్పుడుకాని తేజుకి తన మీద అంచనాలు ఎలా ఉంటాయో అర్థం అయ్యింది. తర్వాత వచ్చిన సినిమాలు చూసి అతనే స్వయంగా మళ్ళి కాల్ చేసి సారీ చెప్పాడని చెప్పుకొచ్చాడు తేజు. సక్సెస్ ఉన్నప్పుడు కంటే లేనప్పుడే వాటి విలువ ఇంకా బాగా తెలుస్తుంది. తేజు తెలిసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తున్నాడు. మావయ్యలను అనుకరించడం మొదలుకొని పాత సూపర్ హిట్ సాంగ్స్ ని అదే పనిగా రీమిక్స్ చేసి మెగా ఫాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు ఏ మాత్రం ఫలితం ఇవ్వడం లేదు. ఇంటెలిజెంట్ సినిమాలో చమక్ చమక్ చాం పాటను కంపోజ్ చేసిన తీరు - ఒరిజినల్ ని మక్కికి మక్కి అనుకరించే ప్రయత్నం చేయటం ఇవన్ని ఫ్యాన్స్ కే నచ్చలేదు. కథల పరంగా కూడా మాస్ కి నచ్చే అంశాలు ఉన్నాయనిపిస్తే చాలు కథలు ఓకే చేస్తున్న సాయి ధరం తేజ్ తన ఆశలన్నీ కరుణాకరన్ సినిమా మీదే పెట్టుకున్నాడు.

కరుణాకరన్ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ బాగా డీల్ చేస్తాడు. తొలిప్రేమ అతని బెస్ట్ మూవీ అయినప్పటికీ తర్వాత చేసిన వాసు - యువకుడు - హ్యాపీ - ఉల్లాసంగా ఉత్సాహంగా - బాలు లాంటి సినిమాల్లో మంచి ఎమోషన్స్ ని చూడొచ్చు. అందుకే సీనియర్ మెగా నిర్మాతగా పేరున్న కెఎస్ రామారావు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీలో మావయ్యల రిఫరెన్స్ లేకుండా చూసుకుంటున్నాడట.