బాబూ ఇంటలిజెంట్.. ఎక్కడమ్మా?

Sun Jan 21 2018 11:52:01 GMT+0530 (IST)

సంక్రాంతి సీజన్ తర్వాత ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్నది ఫిబ్రవరి రెండో వారాంతమే. మామూలుగా ఫిబ్రవరి అనగానే అన్ సీజన్ గా భావిస్తారు. ఆ టైంలో పెద్ద.. మీడియం రేంజి సినిమాలు రిలీజవడం తక్కువే. పోయినేడాది ఆ టైంలో ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాను రిలీజ్ చేస్తే దారుణమైన ఫలితం వచ్చింది. ఐతే అదేమీ పట్టించుకోకుండా ఈసారి ఒకే తేదీకి నాలుగు మీడియం రేంజి సినిమాల్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ నాలుగూ కూడా ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాలే.ఫిబ్రవరి 9కి ముందుగా డేట్ ఫిక్స్ చేసుకుని ప్రచార హడావుడి మొదలు పెట్టిన సినిమా ‘తొలి ప్రేమ’. ఈ చిత్ర ఆడియో కూడా రిలీజైపోయింది. మరోవైపు మంచు మోహన్ బాబు సినిమా ‘గాయత్రి’ కూడా టీజర్ తో పలకరించింది. ఆసక్తి రేకెత్తించింది. నిఖిల్ సినిమా ‘కిరాక్ పార్టీ’ కూడా ఫస్ట్ లుక్.. టీజర్ గ్లింప్స్ తో ఆకట్టుకుంది. కానీ ఫిబ్రవరి 9కే ఫిక్సయిన మరో సినిమా గురించి మాత్రం ఏ ఊసూ లేదు. వి.వి.వినాయక్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కతున్న ‘ఇంటలిజెంట్’ణు కూడా ఫిబ్రవరి రెండో వారంలోనే రిలీజ్ చేస్తామని నిర్మాత సి.కళ్యాణ్ మీడియాకు సమాచారం ఇచ్చారు.

కానీ ఇప్పటిదాకా ఈ చిత్ర టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ లాంచ్ చేయలేదు. విడుదల తేదీకి ఇంకో 20 రోజులు కూడా టైం లేని తరుణంలో ఇంకా ఈ చిత్రం కోసం ఒక పాట చిత్రీకరిస్తున్నారు. ఇంత పోటీ ఉన్నపుడు ప్రచారం కూడా గట్టిగా చేయాలి. కానీ చిత్ర బృందం మాత్రం ఆ దిశగా ఏమీ ఆలోచించట్లేదు. ఈ సినిమాకు సంబంధించి ఏ హడావుడీ లేదు. మరి వినాయక్ టీం ప్లాన్ ఏంటో? లేటుగా మొదలుపెట్టి కొంచెం గట్టిగా ప్రచారం చేస్తారా..? లేక సినిమాను ఫిబ్రవరి 9 నుంచి వాయిదా వేస్తారా?