Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'సామి'

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:04 PM GMT
మూవీ రివ్యూ : సామి
X
చిత్రం : సామి
నటీనటులు: విక్రమ్ - కీర్తి సురేష్ - ఐశ్వర్యా రాజేష్ - బాబీ సింహా - ప్రభు - సూరి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: ప్రియన్ - వెంకటేష్ అంగురాజ్
నిర్మాత: శిబు తమీన్స్
రచన - దర్శకత్వం: హరి

ఒకప్పుడు ‘సామి’.. పితామగన్’.. ‘అపరిచితుడు’ లాంటి సినిమాలతో దక్షిణాదిన పెద్ద హీరోగా ఎదిగాడు విక్రమ్. కానీ పుష్కర కాలం నుంచి అతడికి సరైన విజయం లేదు. మధ్యలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన విక్రమ్.. ‘సామి’తో తనకు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన హరితో జత కట్టాడు. ‘సామి’కి సీక్వెల్ చేశాడు. ‘సామి’ పేరుతో ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రామస్వామి (విక్రమ్) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయినా.. తన తాతయ్య అండతో కష్టపడి పైకెదుగుతాడు. ఢిల్లీలో ఒక మంత్రి దగ్గర మేనేజర్ గా పని చేస్తూ సివిల్స్ ప్రిపేరవుతుంటాడు. మంత్రి కూతురు తనను ప్రేమించినా పట్టించుకోకుండా కెరీర్ మీదే దృష్టిపెడతాడు. అతను కోరుకున్నట్లే సివిల్స్ పరీక్షలో పాసై శిక్షణ కోసం ముస్సోరి వెళ్తాడు. అది పూర్తయ్యాక రామస్వామి కలెక్టరవుతాడని తాతయ్య ఆశిస్తే అతనేమో ఐపీఎస్ తీసుకుంటాడు. అప్పుడే రామస్వామి గతం గురించి తెలుస్తుంది. అతడి తల్లిదండ్రుల్ని విజయవాడకు చెందిన రావణ భిక్షు అనే రౌడీ చంపేశాడని వెల్లడవుతుంది. దీంతో అతడిపై ప్రతీకారానికి సిద్ధపడి విజయవాడకు బయల్దేరతాడు సామి. మరి ఈ పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘సామి’లో హీరో సివిల్స్ ప్రిపేరవుతుంటాడు. హీరో ప్రిపేరయ్యాడంటే పరీక్ష పాసవ్వకుండా ఎలా ఉంటాడు? అతనొక్కడే కాదు.. ఫ్రెండ్ బ్యాచ్ కూడా పాసైపోతుంది. తర్వాత ట్రైనింగ్ ముగుస్తుంది. ఏ సర్వీస్ కావాలో తేల్చుకోవడానికి ఉన్నతాధికారులు పిలుస్తారు. లోపలికి వెళ్లేముందు హీరోకు ఒక పోలీస్ అధికారి ఖాకీ చొక్కా తాకుతుంది. అంతే.. ఐఏఎస్ అడగాలనుకున్నవాడు కాస్తా ఆ తాకిడితో ఐపీఎస్ అడుగుతాడు. అప్పుడే కాదు.. మరో సందర్భంలో పురోహితుడిగా తాతతో కలిసి ఓ పెళ్లి జరిపిస్తుంటే.. అక్కడా ఖాకీ చొక్కా తగిలి వీర లెవెల్లో ఫైట్ చేసేస్తాడు. దీనికి కారణం హీరో తండ్రి ఒకప్పుడు పోలీస్ కావడమేనట. ఈ సీన్లు చూసి ‘సామి’ హార్రర్ టచ్ ఉన్న ఫాంటసీ సినిమా ఏమో అనుకుంటాం. కానీ ఇది సగటు యాక్షన్ సినిమానే. ఒక మామూలు పోలీస్ స్టోరీనే. ఇలాంటి విచిత్ర విన్యాసాలు ఓన్నో చూడొచ్చు ‘సామి’ లో. మాస్ సినిమా అంటే ఏం చేసినా చెల్లిపోతుందేమో అన్న భ్రమతో తీసినట్లుగా అనిపిస్తుంది ‘స్వామి’ చూస్తున్నంతసేపూ.

ఒకప్పుడు తమిళంలో కొత్త తరహా సినిమాలొచ్చేవి. తెలుగులో రొటీన్ సినిమాల వరద సాగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్సవుతున్నట్లుంది. మన దర్శకుల తీరు మారింది. ప్రేక్షకుల అభిరుచి మారింది. ఇక్కడ కొత్తదనానికి పట్టం పడుతుంటే.. తమిళంలో మాత్రం రొటీన్ మాస్ సినిమాలొస్తున్నాయి. ఆ కోవలోని చిత్రమే ‘సామి’ . దశాబ్దంన్నర కిందట తెలుగులో ‘లక్ష్మీనరసింహ’గా రీమేక్ అయిన తమిళ చిత్రం ‘సామి’కి ఇది సీక్వెల్. అప్పటికే ఎన్నో పోలీస్ స్టోరీలు చూశాం కానీ.. అది చాలా భిన్నంగా కనిపించింది. విచిత్రమైన మనస్తత్వం.. దూకుడు ఉన్న పోలీస్ గా హీరో పాత్రను భలేగా తీర్చిదిద్ది ప్రేక్షకుల్ని మెప్పించాడు హరి. అప్పుడు సినిమాకు హీరో పాత్ర చిత్రణ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. ఈసారి ప్రధాన పాత్ర చాలా సాధారణంగా తయారైంది హీరో పాత్రలోనే కాదు.. కథలోనూ ఏ కొత్తదనం.. విశేషం లేకపోయింది.

ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీయడం అంత సులువు కాదు. ముందే ప్రేక్షకులు ఒక అంచనాతో ఉంటారు. ఐతే అసలే అంచనాలు లేకుండా చూసినా ‘స్వామి’ చాలా బ్యాడ్ అనిపిస్తుంది. మామూలుగా ఆరంభ సన్నివేశం నుంచే తన సినిమాల్ని పరుగెత్తించే హరి.. ‘స్వామి’లో మాత్రం ప్రథమార్ధాన్ని నీరసంగా నడిపించాడు. పేలవమైన ప్రేమకథ.. విసుగెత్తించే కామెడీ ప్రథమార్ధాన్ని నీరుగార్చేశాయి. ఇంటర్వెల్ ముంగిట అసలు కథ మొదలు కావడంతో ఆసక్తి మొదలవుతుంది. ఇక ద్వితీయార్ధమంతా హీరో.. విలన్ హోరాహోరీగా తలపడతారని ఆశిస్తాం. కానీ అక్కడక్కడా కొన్ని మెరుపులున్నప్పటికీ ఆసక్తికరమైన ఎపిసోడ్లేమీ పడలేదు. యాక్షన్ సన్నివేశాలు మాస్ ను మెప్పించేలా ఉన్నా.. కథ పరంగా పెద్దగా మలుపులు లేకపోయాయి. ‘సామి’.. ‘సింగం’ సిరీస్ ల్లోని పోలీస్ పాత్రల తరహాలో ఈ క్యారెక్టర్ పేలలేదు. హరి ఎంచుకున్న కథతో పాటు అతడి నరేషన్ కూడా ఔట్ డేట్ అయిపోవడంతో ‘సామి’ చాలా త్వరగా ప్రేక్షకుల ఆసక్తిని చంపేస్తుంది. మాస్ ను మెప్పించే కొన్ని అంశాలున్నప్పటికీ.. వాళ్లకు కూడా ఇది సంతృప్తినేమీ ఇవ్వదు.

నటీనటులు:

విక్రమ్ రామస్వామి పాత్రకు తగ్గట్లే పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మాస్ ప్రేక్షకులు మెచ్చే రీతిలో అతను కనిపించాడు. హీరో రౌద్రం చూపించే సన్నివేశాల్లో విక్రమ్ నటన ఆకట్టుకుంటుంది. ఐతే విక్రమ్ నుంచి మామూలుగా ప్రేక్షకులు ఆశించే వైవిధ్యం ఏమీ ఇందులో కనిపించదు. కీర్తి సురేష్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. ఆమె మామూలుగానే కనిపిస్తుంది. తన అందంతో ఆకట్టుకుంటుంది. ఐశ్వర్యా రాజేష్ గురించి చెప్పడానికేమీ లేదు. విలన్ పాత్రలో కనిపించిన బాబీ సింహా ఆకట్టుకున్నాడు. విక్రమ్ స్థాయికి అతను సరిపోతాడా అని మొదట్లో అనిపిస్తుంది కానీ.. పోను పోను అలవాటు పడతాం. ప్రభుది అంత గుర్తింపు ఉన్న పాత్రేమీ కాదు. సూరి కామెడీ మరీ లౌడ్ గా అనిపిస్తుంది. మాస్ ను ఆకట్టుకోవచ్చు.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఏ ప్రత్యేకతా లేదు. ఒక్క పాట కూడా ప్రత్యేకంగా అనిపించదు. రొటీన్ గా వాయించేశాడు. మాస్ సినిమాల్లో కూడా మంచి మెలోడీలు అందించే దేవిశ్రీ ఈసారి మాత్రం అలాంటి పాట ఒక్కటీ ఇవ్వలేదు. పాటల్లో తమిళ వాసనలు ఎక్కువయ్యాయి. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లుగా సాగుతుంది. ఛాయాగ్రహణం హరి స్టయిల్లో సాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీలు తీయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు హరి.. ఈసారి తనదైన ముద్ర వేయలేకపోయాడు. ‘సామి’.. ‘సింగం’ సిరీస్ లోని సినిమాల మాదిరి ఇందులో మలుపులు.. ఆసక్తికర సబ్ ప్లాట్స్ లేకపోయాయి. చాలా మామూలు కథాకథనాలతో బండి లాగించేశాడు. ఎక్కడా కొత్తదనం లేకుండా పాత స్టయిల్లో లౌడ్ గా సినిమాను నడిపించాడు.

చివరగా: సామి.. ఔట్ డేట్ అయిపోయాడు

రేటింగ్- 2/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre