సాహో లుక్: దొంగవా..పోలీస్ వా డార్లింగ్?

Tue May 21 2019 12:10:27 GMT+0530 (IST)

బాహుబలి సిరీస్ తర్వాత అంతకుమించిన భారీ క్రేజుతో దూసుకొస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. `సాహో` అన్న టైటిల్ తోనే యూనివర్శల్ అప్పీల్ ని ఎలివేట్ చేశాడు. ఇది అల్లాటప్పా సినిమా కాదు. ఇంటర్నేషనల్ లెవల్లో బాక్సాఫీస్ ని షేకాడించే సినిమా ఇదని చెప్పకనే చెప్పాడు. వందేళ్ల భారతీయ సినిమా హిస్టరీలో ఇదివరకెన్నడూ చూడని భారీ యాక్షన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని సుజీత్- యు.వి.క్రియేషన్స్ బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. అందుకే ఈ చిత్రాన్ని 2019 మోస్ట్ అవైటెడ్ చిత్రంగా అభిమానులు భావిస్తున్నారు. ఆగస్టు 15న సునామీలా దూసుకొస్తోంది! అంటూ ఇప్పటికే పలుమార్లు పోస్టర్ల సాక్షిగా ప్రకటించారు. తాజాగా ప్రభాస్ సాహో న్యూలుక్ రిలీజైంది. ఈ పోస్టర్ పైనా ఆగస్టు 15 రిలీజ్ అంటూ ప్రకటించి మరోసారి అగ్గి రాజేశారు.ప్రస్తుతం ఈ కొత్త లుక్ అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది? అన్నదానికి షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ 1 - 2 వీడియోలు మాత్రమే సాక్ష్యంగా నిలిచాయి. అంతకుముందు రివీల్ చేసిన పోస్టర్లలో ముసుగు దొంగలా ముఖాన్ని కప్పుకుని కనిపించాడు. షేడ్స్ ఆఫ్ సాహో 2 వీడియోలో భీకరమైన యాక్షన్ తో కట్టి పడేశాడు. అప్పుడే అసలు మ్యాట్రిక్స్ సీక్వెల్ రేంజులో తీస్తున్నారే.. అంటూ కామెంట్లు వినిపించాయి. కెప్టెన్ అమెరికా.. ట్రాన్స్ ఫార్మర్స్ తరహాలో కెన్నీ బేట్స్ భారీ యాక్షన్ అడ్వెంచర్ ని ఈ సినిమా కోసం తీర్చిదిద్దుతున్న వైనం ఆకర్షించింది.

రకరకాలుగా స్పెక్యులేషన్స్ నడుమ సాహో కొత్త పోస్టర్ రిలీజైంది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. మాతో పాటు చేతులు కలిపి సాహో అనండి. 15 ఆగస్టు 2019 నుంచి థియేటర్లలో యాక్షన్ బిగిన్ అవుతోంది... అంటూ యువి క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ సంథింగ్ ఏదో కథను రివీల్ చేస్తోంది. ఇందులో అతడు దొంగా.. పోలీసా? అన్న సస్పెన్స్ ని ఈ పోస్టర్ లీడ్ చేస్తోంది. అతడు ఓ ప్రత్యేకమైన ఎల్లో లెన్స్ ఉన్న డిజిటల్ కళ్లజోడును పెట్టుకుని కనిపిస్తున్నాడు. దీంతో చీకట్లోనూ మనుషుల్ని.. చుట్టూ ఉన్న పరిసరాల్ని అతడు పరిశీలిస్తాడా? అసలు ఈ ఆపరేషన్ దేనికోసం?  దొంగ పోలీస్ ని వెంటాడే పనా?  లేక పోలీస్ దొంగను వేటాడతాడా? అంతా పెద్ద సస్పెన్స్ గా కనిపిస్తోంది. సాహో చిత్రంలో ప్రభాస్ ని ఒకే కోణంలో చూపిస్తున్నారా?  అతడి పాత్రలో ఇంకేదైనా గ్రే షేడ్ ఉందా? అన్నది సుజీత్ బృందం రివీల్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ సాహో కథ గురించి ఊహాగానాలే తప్ప ఇదీ ప్రభాస్ రోల్ అని ఎవరూ చెప్పలేదు. ఎవరికి వారు స్పెక్యులేషన్ కథల్ని అల్లి జనాల్ని అదే నిజమని నమ్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్.. కమల్ కన్నన్.. మదీ.. సాబు సిరిల్ లాంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాని మరో లెవల్ లోకి ఆవిష్కరించేందుకు నిరంతరం తపిస్తున్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ- ప్రమోద్ నిర్మిస్తున్నారు. టీసిరీస్ సంస్థ హిందీలో రిలీజ్ చేయనుంది.