తమన్... ప్రేమలో పడ్డాడే!!

Thu May 17 2018 13:33:43 GMT+0530 (IST)

తెలుగులో బోలెడు మంది సంగీత దర్శకులున్నప్పటికీ వరుస అవకాశాలు మాత్రం కొందరికే వస్తుంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో తమన్ టైం బాగా నడుస్తోంది. 2013 నుంచి ఏడాదికి అర డజను సినిమాలకి తక్కువ కాకుండా చూసుకుంటున్న ఈ కుర్ర దర్శకుడు... ఈ ఏడాది ఇప్పటికే ఆరు సినిమాలు రిలీజ్ చేసేశాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నవన్నీ ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ప్రాజెక్టులే.ఎంత స్పీడుగా ప్రాజెక్టుకి కమిట్ అవుతాడో అంతే వేగంగా మ్యూజిక్ కొట్టేస్తాడు తమన్. అయితే ట్యూన్స్ రిపీట్ చేస్తాడనే కామెంట్లు వినిపించేవి ఇంతకు ముందు. అయితే ఈ ఏడాది ఆయన సంగీతం అందించిన చిత్రాల్లో ‘తొలిప్రేమ’ మంచి మ్యూజికల్ హిట్ అయ్యింది. క్యూట్ లవ్ స్టోరీకి అంతే మెలోడియస్ ట్యూన్స్ ఇచ్చి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు తమన్. ఇప్పుడు అదే టైపు మరో ప్రేమకథకి ఆయన మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా... నేను లోకల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘హాలో గురూ ప్రేమ కోసమే...’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి రొమాంటిక్ ట్యూన్స్ అందించే పనిలో పడ్డాడట తమన్.

త్రినాథరావు సినిమాలన్నింటిలో మ్యూజిక్ బాగుంటుంది. పాటలు మంచి హిట్టవుతాయి. శేఖర్ చంద్ర దగ్గర్నుంచి రాక్ స్టార్ దేవిశ్రీ దాకా ఆయన అందరి దగ్గరి నుంచి మంచి మ్యూజిక్ రప్పించారు. ఇప్పుడు తమన్ కూడా దర్శకుడి టేస్టుకి- హీరో ఎనర్జీకి తగ్గట్టుగా మంచి పాటలను సెట్ చేసే పనిలో తెగ బిజీగా ఉన్నాడట. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.