కార్తికేయ కలిసిరాలేదా?

Thu Sep 14 2017 10:46:05 GMT+0530 (IST)

బాహుబలి విజయంతో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రేంజి ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మూవీలో రాజమౌళి ఊహలకు రూపమివ్వడానికి తెర వెనుక వందలాది మంది శ్రమించారు. అందులో అతడి కొడుకు కార్తికేయ కూడా ఉన్నాడు. తాత విజయేంద్ర ప్రసాద్ - తండ్రి రాజమౌళి సినిమా రంగానికి చెందిన వారే కావడంతో కార్తికేయ కూడా ఇందులోనే స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ముందు ప్రొడక్షన్ పై పట్టు పెంచుకునే పనిలో పడ్డాడు.

కార్తికేయ పనితనం అక్కినేని కుటుంబానికి అస్సలు పనికిరావడం లేదని ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. నాగార్జున రెండో కొడుకు అఖిల్ లాంచింగ్ సినిమాకు కార్తికేయ పబ్లిసిటీ డిపార్ట్ మెంట్ చూసుకున్నాడు. దాంతోపాటు అఖిల్ మేకింగ్ వీడియోస్ కూడా తనే రూపొందించాడు. సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ పనులు కూడా చూసుకున్నాడు. కానీ అఖిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. తాజాగా నాగచైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం సినిమాకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ సినిమాకయితే షూటింగ్ లో చాలా అంశాల్లో కార్తికేయ ఇన్వాల్వ్ అయి పనిచేశాడని ప్రమోషనల్లో భాగంగా చెప్పుకొచ్చారు. కానీ ఈ మూవీ కూడా ప్రేక్షకాదరణ లేక ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.

సాధారణంగా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువే. ఒకరి హిట్ వచ్చిందనిపిస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. అదే ఫ్లాప్ కి కారణమనే ముద్ర పడితే తిరిగి లేవడం కష్టం. ఇప్పుడు అక్కినేని హీరోలకు కార్తికేయ కాంబినేషన్ కలసిరాలేదనే ప్రచారం అతడికి తీవ్ర నష్టం కలిగించే అంశమే అవుతుంది. ఈ మచ్చ పోవాలంటే కార్తికేయ డైరెక్ట్ గా డైరెక్షన్ రంగంలోకి దిగి తన సత్తా చాటుకోవాలి. కానీ దానికి రాజమౌళి ఏమంటారో.. ఎంతవరకు సపోర్ట్ ఇస్తారో..