రాజమౌళి సోదరుడి సినిమా ఏమైంది?

Sun Jan 14 2018 05:00:01 GMT+0530 (IST)

రాజమౌళి కుటుంబంలో అందరూ ప్రతిభావంతులే. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి.. సోదరుడు కీరవాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. రాజమౌళి సతీమణి రమ స్టైలిస్టుగా గొప్ప పేరే సంపాదించింది. రాజమౌళి మరో సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపే సంపాదించాడు. వీళ్లందరూ అందరికీ పరిచయమే కానీ.. రాజమౌళి మరో సోదరుడు ఎస్.ఎస్.కాంచి గురించి జనాలకు తెలిసింది తక్కువే. ‘అమృతం’ సీరియల్లో కీలక పాత్ర ద్వారా కొంత పేరు సంపాదించిన కాంచి.. ‘మర్యాద రామన్న’కు కథ అందించడంతో పాటు రాజమౌళి సినిమాలు మరి కొన్నింటికి రచనా సహకారం అందించాడు.బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కాంచి గత ఏడాదే దర్శకుడిగా కూడా మారాడు. తొలి ప్రయత్నంలో ‘షో టైం’ అనే విభిన్నమైన సినిమాకు శ్రీకారం చుట్టాడు. ‘బాణం’ ఫేమ్ రణధీర్.. కొత్తమ్మాయి రుస్కార్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఫస్ట్ టీజర్.. ట్రైలర్ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. విభిన్నమైన థ్రిల్లర్ సినిమా చూపించేలా కనిపించాడు కాంచి. గత ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్ర ఆడియో వేడుకను ఘనంగా చేశారు. రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్.. కీరవాణి.. వీళ్లంతా వచ్చి కాంచి గురించి.. ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. సినిమాకు బజ్ కూడా వచ్చింది. ఇక విడుదలే తరువాయి అనుకుంటుండగా.. సినిమా వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడు దాని స్టేటస్ ఏంటో కూడా తెలియదు. ఎప్పుడు రిలీజవుతుందో తెలియదు. మంచి బజ్ ఉన్నపుడు దాన్ని ఎందుకు రిలీజ్ చేయలేదో.. ఆ తర్వాత పూర్తిగా దాన్ని పట్టించుకోకుండా ఎందుకొదిలేశారో తెలియదు.